కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాక సందర్భంగా వరంగల్ లో పెద్ద ఎత్తున జనసమీకరణ జరగడంతో, ఆయన వచ్చిన మరో ఏడెనిమిది రోజులకే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వస్తుండడంతో, అందుకు పోటీగా జనసమీకరణ జరపాలని బిజెపి రాష్ట్ర నేతలు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణాలో రాజకీయ ప్రత్యామ్న్యాయం కాంగ్రెస్ కాదని, తామే అని చెప్పుకొంటున్న బిజెపి నేతలకు అమిత్ షా సభ ప్రతిష్టాత్మకంగా మారింది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 14న మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుక్కుగూడ సమీపంలో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతున్నారు. గతంలో మొదటి దశ పాదయాత్ర ముగింపు సభకు కూడా ఆయనే హాజరయ్యారు. అయితే ఆ సమయంలో వివిధ కారణాల చేత పెద్ద ఎత్తున జనసమీకరణ చేయలేక పోయారు.
అందుకనే ఈ పర్యాయం ఒక వంక పాదయాత్రలో ఉంటూనే జనసమీకరణ పట్ల కూడా సంజయ్ స్వయంగా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రతి నియోజకవర్గం నుండి జనసమీకరణ జరగాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయమై వరుసగా జిల్లాల నేతలతో మంతనాలు జరుపుతున్న ఆయన ప్రతి పోలింగ్ బూత్ నుండి కనీసం 20 మందిని తరలించాలని, ప్రతి నియోజకవర్గం నుండి 5,000 మందికి పైగా పాల్గొనే విధంగా చూడాలని చెబుతున్నారు.
రాహుల్ సభకన్నా నాలుగు రేట్లు ఎక్కువగా జనసమీకరణ జరిపి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలను గట్టిగా ప్రజల్లోకి పంపాలని భావిస్తున్నారు. ఈ విషయమై జిల్లాల వారీగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం పార్టీ మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో వేర్వేరుగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో చేపట్టిన రెండో విడత పాదయాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోందని, ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి సమస్యలను చెప్పుకుంటున్నారని చెప్పారు. పాలమూరు జిల్లా ఎడారిని తలపిస్తోందని, ఎటు చూసినా సమస్యలే తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముగింపు సభ గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం కూడా చేపడుతున్నారు పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా విచ్చేస్తున్నారనే విషయాన్ని ఊరూవాడా ప్రచారం చేయాలని సంజయ్ కోరారు. ఎక్కడిక్కడ డప్పు చాటింపులు, ర్యాలీలు, మీడియా సమావేశాలతో పాటు సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి ఒక్కరూ సభకు హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు.
మరోవంక, సోమవారం నుండి మండలాలు, జిల్లాల కేంద్రాల్లో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని, విద్యుత్ బిల్లులను దగ్దం చేయాలని సంజయ్ పిలుపునిచ్చారు. ఇటీవల మైనారిటీల చేతిలో హత్యకు గురైన దళిత బిడ్డ నాగరాజు ఘటనలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని కూడా సూచించారు.