తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వం చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసే కాన్వాయ్ వాహనాలకు చెల్లించ వలసిన అద్దెలు కూడా చెల్లింపలేక పోతున్నది. దానితో ఆయన పర్యటనకు వాహనాలను సమకూర్చుకోవడం అధికారులకు కష్టంగా మారింది.
గత మూడేళ్లలో వాహనాలకు ఛేళించవలసిన అద్దె రూ.18.11కోట్లకు పేరుకు పోవడంతో ప్రభుత్వం అద్దెకు రమ్మంటే ప్రైవేటు ట్రావెల్స్, ట్యాక్సీ యాజమానులు, డ్రైవర్లు దండం పెట్టేస్తున్నారు. చేసేది లేక ఆర్టీఏ అధికారులు ప్రైవేటు వాహనాలను రోడ్లపై ఆపేసి బలవంతంగా తీసుకెళ్లిపోతున్నారు.
ఇటీవల అదే విధంగా ఒంగోలు లో తిరుమలకు తీర్థయాత్రకు వెడుతున్న ఓ కుటుంభం సభ్యులను అర్ధరాత్రి వారి వాహనం సీఎం కాన్వాయ్ కోసం అంటూ బలవంతంగా తీసేసుకొని, వారిని రోడ్డుపై వదిలి వెళ్లిపోవడంతో మీడియాలో రాద్దాంతం గా మారింది. దానితో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని సీఎంవో ఆదేశించడం ద్వారా నష్ట నివారణ చర్య చేపట్టారు.
దీంతో కాన్వాయ్ కు వాహనాలు సమకూర్చలేమంటూ అధికారులు చేతలెత్తేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఆర్థికశాఖకు లేఖ రాసినట్లు తెలిసింది.కాన్వాయ్ కోసం ప్రతియేటా రూ 4.54 కోట్లు అవసరమవుతురదని తెలిపారు.
ఇటీవలే రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పినిపే విశ్వరూప్ తన శాఖపై సమీక్ష నిర్వహించారు. సీఎం జిల్లాల పర్యటనలు పెంచబోతున్నారని, ఎక్కడా వాహనాల ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆయన చెప్పారు. వెంటనే అక్కడున్న అధికారులు ఒక్కసారిగా ‘మా వల్ల కాదు సార్..’ అని నిస్సహాయంగా ముఖాలు పెట్టారు.
పాత బకాయిలు చెల్లిస్తేనే సీఎం కాన్వాయ్కి వాహనాలు సమకూర్చగలమని తేల్చేశారు. ఒంగోలు ఘటనను కూడా గుర్తుచేశారు. అధికార వర్గాల సమాచారం మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా రూ.ఆరున్నర కోట్లు పెండింగ్ ఉన్నట్లు తెలిసింది.
విశాఖపట్నం జిల్లాలోరూ 4.66కోట్లు, శ్రీకాకుళం జిల్లా-రూ 1.50కోట్లు, చిత్తూరు జిల్లాలో రూ 1.40కోట్లు, కృష్ణా జిల్లాలో రూ 1.11కోట్లు ట్రావెల్స్, ట్యాక్సీలకు ప్రభుత్వం బకాయి ఉంది. కాంట్రాక్టర్లు మొదలు ఎవ్వరికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు.