రెండేళ్లుగా మూడు రాజధానులంటూ రాజధాని నగరంగా అమరావతి అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా వస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నది. మూడు రాజధానుల చట్టం చెల్లదని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ విషయమై ముందు వెళ్లలేక, వెనుకడుగు వేయలేక సతమతమవుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
హైకోర్టు తీర్పుపై వెంటనే రాష్ట్ర శాసనసభను సమావేశ పరచి శాసనవ్యవస్థ పరిధిలో హైకోర్టు జోక్యం ఏమిటని అంటూ ఆగ్రవేశాలు వ్యక్తం చేసినప్పటికీ ఇప్పటి వరకు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయడం లేదు. హైకోర్టు తీర్పుకు ముందే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుుడు వాటి స్ధానంలో కొత్త బిల్లు తెచ్చేందుకు కూడా సాహసించడం లేదు. ఆ దిశలో ఎటువంటి కసరత్తు చేయడం లేదు.
కేవలం ఆరు నెలల్లో రాజధానిగా అమరావతి ఏర్పాట్లు పూర్తి కావాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే అమలు జరపడం కష్టమని, అందుకు ఆరేళ్ళ సమయం పడుతుందని మాత్రం ఓ అఫిడవిట్ ను హైకోర్టులో వేశారు. పలువురు న్యాయనిపుణులు, సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిన తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లినా సానుకూలంగా తీర్పు వస్తుందనే భరోసా కలగక పోవడంతోనే ఈ విషయమై వెనకడుగు వేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ ఇప్పటి నుండి ఎన్నికల సన్నాహాలు హడావుడి చేస్తున్న జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నదన్న సంకేతం ఇస్తున్నారు. అయితే ఈ మధ్య మంత్రులు, అధికార పార్టీ ఎమ్యెల్యేలు, నాయకులు ఎవ్వరు మూడు రాజధానుల గురించి మాట్లాడటం లేదు. ఈ విషయమై దాదాపు మౌనం వహిస్తున్నారు. ఈ దానితో ఈ విషయమై ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు.
హైకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీ సమావేశంలో అసహనం వ్యక్తం చేసిన జగన్.. ఆ తర్వాత మూడు రాజధానుల అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ విషయమై రచ్చ చేసే అవకాశం కల్పించినట్లు అవుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో దీనిని ఓ ప్రధాన అంశంగా తీసుకొచ్చే అవకాశం ఉంది.
మరోవంక, బీజేపీ కూడా అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ స్వరం పెంచుతున్నది. బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు ప్రత్యేకంగా అమరావతి ప్రాంతంలో పర్యటించి చట్ట ప్రకారం మూడు రాజధానులు చేయరు, చేయలేరంటూ స్పష్టం చేశారు. అమరావతిని ‘ఆదర్శ రాజధాని చేస్తా’ అని చెప్పి అధికారంలోకి వచ్చాక జగన్ నమ్మక ద్రోహం చేశారని ఆయన దుయ్యబట్టారు.
టీడీపీతో చేయాల్సిన రాజకీయాలు చేసుకోండని.. కక్ష పూరితమైన రాజకీయాలకు అమరావతి రైతులను బలి చేయవద్దని జీవీఎల్ జగన్ మోహన్ రెడ్డికి హితవు చెప్పారు. ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని, ఇంకా మోసం చేయాలని చూస్తే బెడిసి కొట్టడం ఖాయమని జీవీఎల్ హెచ్చరించారు.