కాశీ విశ్వనాథుని ఆలయం సమీపంలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో మూడు రోజులుగా కోర్ట్ నియమించిన న్యాయవాదుల బృందం సర్వేలో సోమవారం శివలింగం బయటపడింది. దయానిధి, వెంటనే ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని స్థానిక యంత్రాంగాన్ని వారణాసి సివిల్ కోర్టు ఆదేశించింది.
ఉదయం 10.30 గంటల ప్రాంతంలో శివలింగం కనబడడంతో జ్ఞానవాపి మసీదు కాంపెక్స్‌లో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే పూర్తయింది. ఇక్కడున్న బావిలో శివలింగం బయటపడినట్టు హిందూవుల అడ్వకేట్లు ప్రకటించారు. శివలింగానికి రక్షణ కల్పించాలంటూ న్యాయవాది విష్ణు జైన్ నేరుగా సివిల్ కోర్టును ఆశ్రయించారు.
దీంతో జిల్లా మేజిస్ట్రేట్‌కు కోర్టు తక్షణ ఆదేశాలు జారీ చేసింది. శివలింగం లభించిన ప్రాంతాన్ని వెంటనే సీల్ చేయాలని, విజిటర్ల ప్రవేశాన్ని నిషేధించాలని కోర్టు ఆదేశించింది. సీల్ చేసిన ప్రాంతానికి భద్రత కల్పించాలని వారణాసి డీఎం, పోలీస్ కమిషనర్, సీఆర్పీఎఫ్ కమాండంట్‌లకు ఆదేశాలిచ్చింది.
శివలింగం 12 అడుగుల 8 అంగుళాల వ్యాసం కలిగి ఉందని, సంప్రదాయం ప్రకారం నందిని ఎదుర్కొంటున్న దిశలో ఉందని న్యాయవాది మదన్ యాదవ్ తెలిపారు. కాగా, సర్వే వర్క్‌పై అడ్వకేట్ కమిషనర్లు ఎలాంటి వివరాలను బహిర్గతం చేయనప్పటికీ తమ సర్వేలో తేలిన వివరాలను మంగళవారంనాడు కోర్టుకు తెలియజేయనున్నట్టు చెప్పారు.
సర్వేలో సమగ్ర సాక్షాలు లభ్యమైనట్టు జ్ఞానవాపి కేసులో పిటిషనర్ సోషల్ లాల్ ఆర్య తెలిపారు. ”బాబా మిల్ గయే” అంటూ ముక్తసరి సమాధానమిచ్చారు. హిందువుల తరఫు అడ్వకేట్ మోహన్ యాదవ్ దీని పై మాట్లాడుతూ, 12 అడుగుల 8 అంగుళాల వ్యాసార్ధంలో శివలింగం ఉన్నట్టు చెప్పారు.
మసీదు ప్రాంగణంలో శని, ఆదివారాల్లో సర్వే నిర్వహించారు. నమాజుకు ముందు ముస్లింలు తమ కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునే చెరువు (pond)ను సర్వే కోసం ఖాళీ చేశారు. ఆ చెరువులోనే శివలింగం దొరికినట్టు చెబుతున్నారు. జ్ఞానవాపి కాంప్లెక్ వెస్ట్రన్ వాల్ వద్ద హిందూ ఆలయం కూల్చివేతకు సబంధించిన అవశేషాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం నాలుగో లాక్‌ను సోమవారంనాడు తెరిచారు. మొదటి మూడు గదులు శనివారంనాడు సర్వే కోసం తెరిచారు.
కాశీ విశ్వనాథ ఆలయాన్ని అతిసమీపంలో ఉన్న జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో మసీదు ఉంది. అయితే ఇందులో పూర్వం శివాలయం ఉండేదని, పాత టెంపుల్ కాంప్లెక్స్‌ను గోడను ఆనుకుని ఉన్న దైవ ప్రతిమలకు నిత్యం పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించారు.
దీంతో ఒక ప్రత్యేక కమిషనర్, న్యాయవాదుల బృందాన్ని వీడియోగ్రఫీ ద్వారా సర్వే చేపట్టాలని వారణాసి కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ కమిటీని.. జ్ఞానవాపి మసీదు నిర్వాహక కమిటీ లోనికి రానివ్వలేదు. దీంతో మళ్లీ కోర్టు జోక్యంతో శనివారం నుంచి సోమవారం.. మొత్తం మూడు రోజుల పాటు విచారణ జరిగింది.
కఠిన ఆంక్షలు, నిర్భందం మధ్య మొత్తానికి కమిటీ మొత్తానికి సోమవారంతో సర్వే పూర్తి చేసింది. ఈ తరుణంలో కొలను(బావి) నుంచి శివలింగం బయటపడిందన్న ప్రకటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు హిందూ మహిళలు భారీ ఎత్తున్న ఇక్కడికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు మసీద్ కమిటీ అక్కడే ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న న్యాయస్థానం ఆ ప్రాంతాన్ని సీల్ చేసి.. ఎవరినీ అనుమతించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఇంతకాలం ఆ కొలను(బావి)ని ‘వుజు’ కోసం ఉపయోగించారు. తాజాగా శివలింగం బయటపడడంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయించింది వారణాసి కోర్టు. ప్రస్తుతానికి దానిని ఎవరూ ఉపయోగించకూడదని వారణాసి జిల్లా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే శివలింగం బయటపడిందన్న వార్తను వారణాసి జిల్లా న్యాయమూర్తి కౌశల్ రాజ్ శర్మ ధృవీకరించలేదు. కేవలం పిటిషన్‌దారులు మాత్రమే శివలింగం బయటపడిందంటూ చెప్తున్నారు.
వాస్తవానికి మే 6వ తేదీనే జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్‌లో వీడియో విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ.. మసీద్ కమిటీ వాగ్వాదంతో అది జరగలేదు. పైగా మసీదులో వీడియోలు తీయకూడదంటూ పేర్కొంది. దీనిపై దిగువ న్యాయస్థానం, అలహాబాద్ హైకోర్టు.. చివరకు సుప్రీం కోర్టుకు పంచాయితీ చేరింది.
వీడియో చిత్రీకరణను అడ్డుకోవడాన్ని సుప్రీం తిరస్కరించగా.. మసీద్ కాంప్లెక్స్‌లో సర్వే అంశంపై అభ్యర్థన పిటిషన్‌ను మాత్రం పరిశీలిస్తామని పేర్కొంది. అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ వేసిన పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మే 17న విచారించనుంది. మరోవైపు మూడు రోజుల విచారణ కమిటీ అందించే నివేదికను మే 17వ తేదీనే వారణాసి కోర్టు పరిశీలించనుంది.