వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినా కరోనా మహమ్మారి వెంటాడుతున్నది. ప్రపంచంలో ఏదో ఒక మూల కల్లోలం సృష్టిస్తూనే ఉంది. భారత్‌లోనూ ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆసక్తికరమైన ఓ అధ్యయనం వెలువడింది.
వ్యాక్సినేషన్ పొందిన తర్వాత ఒమైక్రాన్ సోకినవారిలో కరోనా రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది వెల్లడైనది. బూస్టర్ డోస్ కన్నా మెరుగైన ఇమ్యూనిటీ లభిస్తోందని తేలింది. కరోనా వ్యాక్సిన్ తయారీదారు బయోఎన్‌టెక్ ఎస్ఈ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. వ్యాక్సిన్ పొందిన జనాలకు ఒమైక్రాన్ వేరియెంట్ సోకితే ఉత్తత్తి అయ్యే యాంటీబాడీలు అధికంగా ఉంటున్నాయి. ఎక్కువ కొవిడ్కరోనా వేరియెంట్లతో పోరాడగలిగే ఇమ్యూనిటీ ఇలాంటివారిలో కనిపిస్తోందని అధ్యయనకారులు తేల్చారు.
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఇన్స్టిట్యూట్ ఫర్ ఇమ్యూనాలజీ డైరెక్టర్, ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న జాన్ వెర్రీ ఈ అధ్యయనాన్ని సమీక్షించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒమైక్రాన్ సోకితే ఉత్పత్తి అయ్యే రోగనిరోధక శక్తి మరో బూస్టర్ డోసుకు సమానమని పేర్కొన్నారు.
ఇటివల ఒమైక్రాన్ వేరియెంట్ బారినపడ్డవారు బూస్టర్ డోస్ కోసం కొంత కాలం వేచిచూడొచ్చని సలహా ఇచ్చారు. ఒమైక్రాన్ సోకినవారి నాసిక శ్లేష్మంలోనూ యాంటీబాడీలు ఉన్నాయని తెలిపారు. దీంతో శరీరంలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే వైరస్ తన సామర్థ్యాన్ని కోల్పోతుందని విశ్లేషించారు.
దీంతో ఒరిజినల్ వ్యాక్సిన్ల కంటే ఒమైక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనగల వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మెరుగైన రోగ నిరోధకశక్తిని పొందొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాల ఇమ్యూనిటీని పెంచేందుకు వేర్వేరు వ్యాక్సిన్లను బూస్టర్ డోస్‌గా ఇవ్వాల్సిన స్థితిలో ఉన్నామని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ డేవిడ్ వీస్లెర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధ్యయకారులు భరోసా కల్పించారు. బయోఆర్ఎక్స్ఐఆర్ సర్వర్‌పై అధ్యయనం ప్రీప్రింట్ను ప్రచురించారు. కాగా చైనా, ఉత్తర కొరియా తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మరోసారి కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధ్యయనం వెలుగు చూడటం గమనార్హం.