బీజేపీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించినా పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యలు పరిష్కారం కాలేదని గుర్తు చేశారు.
అయితే ప్రధానిగా మోదీ వచ్చాక ఒక్కొక్కటి సమస్యలు కొలిక్కి వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ కు నేడు గౌరవం పెరిగిందని చెప్పారు. బయటి దేశాల నుంచి రక్షణ ఆయుధాల కొనుగోలు తగ్గాయని తెలిపారు.
మహారాష్ట్రలోని పూణెలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్, పూణేలోని డాక్టర్ డివై పాటిల్ విద్యాపీఠ్ విద్యార్థుల 13వ స్నాతకోత్సవంలో కూడా ప్రసంగించారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ సాధించేందుకు యువత కొత్త టెక్నాలజీలను రూపొందించాలని, ఆవిష్కరిం చాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. భారతదేశం తన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలని భావిస్తున్నామని.. దేశీయ రక్షణ కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ఏ దేశానికైనా యువతే అతిపెద్ద బలం, ఉత్ప్రేరకం మాత్రమే కాదు మార్పునకు మూలం అని ఆయన అభివర్ణించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని దానిని అవకాశంగా మార్చుకునే సత్తా యువతకు ఉందని తెలిపారు. వారు కొత్త టెక్నాలజీలను కనుగొని, కొత్త కంపెనీలు, పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేయగల సామర్థ్యాన్ని మన యువత కలిగి ఉన్నారని కొనియాడారు.
యువతపై తమ ప్రభుత్వానికి చాలా నమ్మకం ఉందని చెప్పారు. అందుకే యువత పురోగతితో పాటు దేశ సమగ్రాభివృద్ధికి భరోసా కల్పించడానికి యువతకు పుష్కలమైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.