ప్రతిపక్షాలు అనవసర అనుచిత అంశాలను ప్రాధాన్యత క్రమపు విషయాలుగా చిత్రీకరించడానికి యత్నిస్తాయని, ఈ సాలె గూటిలోకి మనం వెళ్లకుండా మన పథంలో అంటే జాతీయ ప్రయోజనాల కోణంలోనే ముందుకు సాగాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి నాయకులు, కార్యకర్తలను హెచ్చరించారు.
రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న బిజెపి కార్యవర్గ సమావేశంలో సభ్యులను ఉద్ధేశించి మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రసంగిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు ఏదో విధంగా దేశాన్ని ప్రధాన అంశాల నుంచి దారిమళ్లించే ఓ వలయాన్ని సృష్టిస్తాయని తెలిపారు. అయితే ఈ బోనులో పార్టీ నేతలు పడరాదని స్పష్టం చేశారు.
కేవలం జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి వ్యవహరించాలని హితవు చెప్పారు. ఈ ఎనిమిదేళ్లుగా తమ ప్రభుత్వం సుపరిపాలన, సామాజిక న్యాయానికి అంకితం అయిందని, దీనినే ఆలంభనగా చేసుకుని పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లడం, ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడం జరగాలని ప్రధాని సూచించారు.
తేలిక మార్గాలను ఎంచుకుంటే ఫలితం ఉండదని తేల్చి చెప్పారు. అంకితభావం, శ్రమించడం వల్లనే ప్రయోజనాలు దక్కుతాయని పేర్కొన్నారు. దేశ ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకోండి. వచ్చే పాతికేళ్లకు సరిపడా లక్షాలను ఖరారు చేసుకోండి, వీటి సాధనకు నిరంతరం పాటుపడండని అంటూ పిలుపు నిచ్చారు.
దేశ ప్రజలకు సుపరిపాలన అందించడానికి, సామాజిక న్యాయం చేయడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అంకితమైందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘పేదల సంక్షేమానికి, సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ‘ఆజాదీ కా అమృత్ ఉత్సవ్’గా కేంద్రం పాటిస్తోంది. దేశం వచ్చే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అలాగే బీజేపీ కూడా రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం వచ్చింది” అని ప్రధాని సూచించారు.
ఈ నెలలో ఎన్డీయే ప్రభుత్వ పాలన ఎనిమిదేళ్లు పూర్తవుతుందని గుర్తు చేస్తూ, ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో విజయాలు సాధించామని, సన్నకారు రైతులు, కూలీలు, మధ్య తరగతి ప్రజల అంచనాలను నెరవేర్చామని మోదీ తెలిపారు. దేశం సుస్థిరంగా అభివృద్ధి చెందుతోందని చెబుతూ సామాజిక భద్రత కల్పించామని, అమ్మలు, కుమార్తెలు, అక్కాచెల్లెళ్ల సాధికారతకు అంకితమయ్యామని స్పష్టం చేశారు.
“నేడు ప్రపంచం గొప్ప అంచనాలతో మన దేశాన్ని చూస్తోంది. అలాగే మన దేశంలో ప్రజలకు బీజేపీపై ప్రత్యేక అభిమానం ఉంది. ఎంతో నమ్మకంతో, ఎన్నో ఆశలతో పార్టీని చూస్తున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు మన బాధ్యతను పెంచాయి. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికీ అందేలా బీజేపీ నేతలు కృషి చేయాలి’’ అని మోదీ వివరించారు.