తెరపై తాము రాజకీయ విరోధులం అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనిపిస్తుంటారు. తమ రాష్ట్ర ప్రయోజనాలకు పొరుగున ఉన్న ముఖ్యమంత్రి విఘాతం కలిగిస్తున్నారని అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ లోపాయికారిగా ఇద్దరు కుమ్మక్కై ఆర్ధిక దోపిడీకి పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వారు ఎంపిక చేసిన అభ్యర్థుల తీరు ఈ అంశాన్ని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల నుండి మొత్తం ఏడుగురిని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేస్తే, వారిలో కేవలం వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాత్రమే తొలినుండి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
అంతకన్నా జగన్ ఎదుర్కొంటున్న అవినీతికి సంబంధించి సిబిఐ, ఈడీ కేసులలో జగన్ మొదటి ముద్దాయి అయితే, విజయసాయి రెండో ముద్దాయి. ఇద్దరు కలసి గతంలో 16 నెలలో జైలులో గడిపి, ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అవినీతి కేసులు ముందుకు సాగకుండా కట్టడి చేసేందుకు ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు నడపడమే ఆయన చేసే ప్రధానమైన రాజకార్యం.
వైసిపి మరో అభ్యర్థి బీదం మస్తాన్ రావుటిడిపి నేత. 2019 ఎన్నికలలో నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా పోటీచేసి, ఓటమి చెందిన అనంతరం వైసిపిలో చేశారు. ఆయనను ఎంపిక చేయడంలో ఆర్ధిక ప్రయోజనాలే కీలకం అని అందరికి తెలుసు.
ఇక మిగిలిన ఇద్దరు వైసిపి అభ్యర్థులు – ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి తెలంగాణకు చెందిన వారు. ఇప్పటివరకు వారికి వైసిపి సభ్యత్వం కూడా లేదు. కృష్ణయ్య 2014 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా హైదరాబాద్ లో ఎల్బీ నగర్ నుండి బిజెపి మద్దతుతో శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆ తర్వాత ఆ పార్టీకి దూరమై, 2018 అసెంబ్లీ ఎన్నికలలో మిర్యాలగూడెం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా రాజ్యసభకు వెడుతున్నారు. నిరంజన్ రెడ్డి న్యాయవాదిగా కేసీఆర్, జగన్ లకు సేవలు అందిస్తున్నారు.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కొన్ని స్థానాలకైనా పోటీ చేసి, ప్రతిపక్ష ఓట్లను, కృష్ణయ్య ప్రభావంతో బీసీ ఓట్లను చీల్చగలిగితే అది టీఆర్ఎస్కు ఉపయోగపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు సీఎంలకు ఉన్న రాజకీయ సఖ్యత దృష్ట్యా ఇలాంటి వ్యూహం ఉండొచ్చని భావిస్తున్నారు.
మరోవంక, కేసీఆర్ ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులు కూడా ఏపార్టీలో సభ్యత్వం ఉన్నవారు కారు. హెట్రో డ్రగ్స్ అధినేత పార్థసారధి రెడ్డి జగన్ కు సన్నిహితులే కాకుండా, ఆయన ఎదుర్కొంటున్న కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఆదాయపన్ను శాఖ అధికారులు చేసిన దాడులలో లెక్కకు రాని రూ 141 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆయనకే జగన్ సీట్ ఇవ్వాలనుకున్న, వీలు కాకపోవడంతో కేసీఆర్ ఇచ్చారని చెబుతున్నారు. కరోనా సమయంలో అక్రమంగా అత్యవసర మందులు అమ్ముకున్నారని ఆరోపణలు కూడా చెలరేగాయి. ఒకరు ఫార్మాలో మందులు అమ్మమంటే బీరువాలో డబ్బులు పెట్టుకున్నారని, మరొకరు ముఖ్యమంత్రికి డబ్బులు సమకూర్చే సిఎ కాగా, మరొకరేమో అన్ని పార్టీలు తిరిగి, గ్రానైట్ కుంభకోణంలో ఉన్న వ్యక్తి అని బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందనరావు దయ్యబట్టారు.
ఆర్ధిక నేరస్తులకు, పన్ను ఎగవేత దారులకు పెద్దపీట వేసి కేసీఆర్ అభ్యర్థులుగా ప్రకటించారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఏపీలో సీఎం జగన్ ప్రకటించిన అభ్యర్థిత్వాలను పరిశీలిస్తే తన సోదరి షర్మిల కోసమే జగన్ ఇక్కడి వారికి రాజ్యసభ సీటు కేటాయించారని అర్థమవుతుందని ఆరోపించారు.
కేసీఆర్ వేలంలో ఎంపీ సీట్లను అమ్ముకున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. రాజ్యసభ సభ్యత్వం పొందిన ముగ్గురు 40 ఎమ్మెల్యే స్థానాలను పంచుకున్నారన్న రఘునందన్ రావు, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని రాజ్యసభ సీట్లు కేసీఆర్ అమ్ముకున్నారని విమర్శించారు.
టీఆర్ఎస్, వైసీపీ మధ్య దృఢమైన రహస్య బంధం
టీఆర్ఎస్, వైసీపీ మధ్య చాలా దృఢమైన రహస్య బంధం ఉందని, వారి స్వప్రయోజనాల కోసం కలిసి పని చేస్తారన్న వాస్తవం రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ద్వారా మరోమారు రుజువైందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆరోపించారు.
జగన్‌కు రాష్ట్ర ప్రయోజనాల కన్నా, వ్యక్తిగత సహ నిందితుల ప్రయోజనాలే ముఖ్యమని మరోసారి రుజువు చేశారని విమర్శించారు. చట్టంలోని లొసుగులను వినియోగించుకుని, నేరస్తులు, వారికి అండగా నిలిచే వారిని పెద్దల సభకు చేరుకునే కార్యక్రమం జరగడం బాధాకరమని ఆక్షేపించారు.
వైసీపీ తరఫున తన కేసులు వాదించే తెలంగాణకు చెందిన నిరంజన్‌రెడ్డి, తన సహనిందితుడు విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీట్లు ఇవ్వగా, తన రాజకీయ గురువు కేసీఆర్ సహకారంతో మరో నిందితుడు హెటిరో పార్ధసారధిరెడ్డిని టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయించుకోగలిగారని దయ్యబట్టారు.