అవినీతి ఆరోపణలపై తన మంత్రివర్గ సహచరుని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తొలగించడమే కాకుండా, ఆ తర్వాత కొద్దిసేపటికే అతనిని అరెస్ట్ కూడా చేశారు. స్వతంత్ర భారత దేశంలో గతంలో ఒక సారి కేవలం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం మాత్రమే అవినీతి ఆరోపణలపై ఓ మంత్రిని తొలగించింది.
ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లా అవినీతికి పాల్పడినట్టు బలమైన ఆధారాలు కనుగొనడంతో సీఎం ఈ చర్య తీసుకున్నారు. వివిధ కాంట్రాక్టులపై అధికారుల నుంచి 1 శాతం కమిషన్ను వసూలు చేసేవారని మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. సింగ్లాపై వచ్చిన ఫిర్యాదులతో ఆయనను పదవి నుంచి తొలగించినట్టు మాన్ చెప్పారు.
టెండర్లపై అధికారుల నుంచి ఒక శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ మంత్రి సింగ్లాపై సీఎం మాన్ కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే అంతర్గత విచారణ చేపట్టిన సీఎం మాన్మం త్రికి ఉద్వాసన పలికారు. అనంతరం సింగ్లాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని, అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తి లేదని భగవంత్ మాన్ మరోసారి స్పష్టం చేశారు.
ప్రజలు ఎన్నో అంచనాలతో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారని, ఆ అంచనాలను నిలబెట్టుకోవడం తమ బాధ్యతని ఆయన వివరించారు. కేబినెట్ నుంచి తొలగించిన నిమిషాల వ్యవధిలోనే అవినీతి నిరోధక శాఖ విజయ్ సింగ్లాను అరెస్ట్ చేశారు. 2015లోనూ అవినీతి ఆరోపణలు వచ్చిన ఒక మంత్రిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ పదవి నుంచి తొలగించారు.
అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని కేజ్రీవాల్ తమ వద్ద వాగ్దానం తీసుకున్నారని, తామంతా ఆయన సైనికులమని మీడియాతో మాన్ చెప్పారు. ‘భగవంత్ మాన్ జీ! అవినీతి మంత్రిని తొలగిస్తూ మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఆనందంతో నా కళ్లు చెమర్చాయి. మీ చర్యల పట్ల దేశం మొత్తం మన పార్టీపై గర్వంగా ఫీలవుతోంది’ అంటూ కేజ్రీవాల్ ఓ ట్వీట్ లో ప్రశంసించారు.