రెడ్లకు పగ్గాలిస్తేనే తెలంగాణాలో కాంగ్రెస్ కు మనుగడ అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలో ఆ పార్టీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఐక్యతా నినాదం వినిపించిన ఆ పార్టీ నేతలలో ఈ వాఖ్యలు చిచ్చు పెట్టిన్నట్లయింది. పలువురు నేతలు రేవంత్ రెడ్డి వాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ వాఖ్యలు ఖండిస్తున్నారు.
పిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అయితే ఈ విషయమై రేవంత్ కు ఓ బహిరంగ లేఖ వ్రాస్తూ ఈ వాఖ్యాలను ఖండిస్తూ వెంటనే మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి వివరణ వివాదం ద్వారా ఏర్పడిన గందరగోళాన్ని నివారించాలని హితవు చెప్పారు.
ఒక్క రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రభుత్వం ఏర్పడేదంటే సుమారు ఏడు సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, కొత్తగా పార్టీలో చేరినా మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా 2018లో పార్టీ ఓటమి పాలైందని గుర్తు చేశారు. అంతేకాక డీకే అరుణ రెడ్డి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మీరు కూడా స్వయంగా ఓటమి పాలయ్యారని నిలదీశారు.
రేవంత్ వాఖ్యలు కాంగ్రెస్ మూలవిధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయికనే అని తేల్చి చెప్పారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 42 లోక్ సభ స్థానాలకు గాను 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుంధిభి మోగించిందని గుర్తు చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూలానే యూపీఏ ఏర్పడింది.. ఆయన మరణం తరువాత యూపీఏ ప్రభుత్వం ఏర్పడలేదు అనడం సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను కించపర్చడమూ, అవమానించడమే అని మధుయాష్కీ తీవ్రంగా విమర్శించారు. బహుశా మీరు అప్పుడు పార్టీలో లేకపోవడం వల్ల ఈ చారిత్రక విషయాలను మీకు తెలియజేస్తున్నాను అంటూ ఎద్దేవా చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే కాకుండా ఆత్మగౌరవ పోరాటం అని గుర్తు చేశారు. తెలంగాణ రాబందుల సమితి పార్టీ చేతిలో ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బతిందని అంటూ ఇటువంటి పరిస్థితుల్లో వరంగల్ డిక్లరేషన్, రాహుల్ గాంధీ సభతో ఉత్తేజితులై, ఊసరవెల్లి కేసీఆర్ మోసాలను గ్రహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలన్నీ కాంగ్రెస్ వైపు వస్తున్నాయని తెలిపారు.
ఇలాంటి తరుణంలో మీరంతా ‘‘మా రెడ్ల కిందనే పనిచేయాలి.. రెడ్లకు మాత్రమే రాజ్యాధికారం, మాకు మాత్రమే సత్తా ఉంది’’ అంటూ చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆక్షేపణీయంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను సైతం మీరు వ్యతిరేకిస్తున్నట్లు మీ వ్యాఖ్యలతో అర్థమవుతోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 శాతం పదవులు కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ఉందని, బిసి, ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు.
కాగా, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను ఏకీభవించడం లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుందని చెబుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న ఆయన.. కాంగ్రెస్ చరిత్ర తెలియని వాళ్లు ఏదో మాట్లాడితే వాటిని పార్టీ వ్యాఖ్యలుగా భావించొద్దని ఎద్దేవా చేశారు.