రైతుల సాధికారత, వారి జీవితాలను ఆధునీకరించడంలో డ్రోన్ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, విద్యుత్, ఆప్టికల్ ఫైబర్, డిజిటల్ సాంకేతికత అందుబాటులోకి వస్తున్నప్పటికీ వ్యవసాయం నేటికీ పాత పద్ధతుల్లోనే సాగుతున్నదని చెప్పారు. ఫలితంగా అనేక చిక్కులతోపాటు ఉత్పాదకత తగ్గిపోవడమే కాకుండా పరిస్థితులు వృథాకు దారి తీస్తున్నాయని స్పష్టం చేశారు.
భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ వేడుక “భారత్ డ్రోన్ మహోత్సవ్-2022”ను ఆయన శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘కిసాన్ డ్రోన్’ పైలట్లతో సంభాషించారు. డ్రోన్ల బహిరంగ ప్రదర్శనను తిలకించడంతోపాటు అంకుర సంస్థల ప్రతినిధులతోనూ మాట్లాడారు.
రక్షణ, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, పర్యాటకం, చలనచిత్ర, వినోద రంగాల్లో డ్రోన్ల వినియోగం ఎక్కువగా కనిపిస్తోందని ప్రధాని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత వినియోగం మరింత పెరగడం తథ్యమన్నారు. ‘ప్రగతి’ సమీక్షలు, కేదార్నాథ్ ప్రాజెక్టులపై పర్యవేక్షణను ఉదాహరిస్తూ.. తాను అధికారిక నిర్ణయాలు తీసుకోవడంలో డ్రోన్లు ఉపయోగపడిన తీరును కూడా ఆయన వివరించారు.
డ్రోన్ల రంగంలో ఎనలేని శక్తి, ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఈ దిశగా భారత్ బలాన్ని, అగ్రస్థానానికి దూసుకెళ్లాలనే తపనను ఇవి సూచిస్తున్నాయని తెలిపారు. ఫలితంగా ఈ రంగం విస్తృతావకాశాలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వాల హయాంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమస్యల్లో భాగంగా పరిగణిస్తూ దాన్ని పేదల వ్యతిరేకిగా చిత్రించే ప్రయత్నాలు జరిగాయని ప్రధాని గుర్తుచేశారు. దీనివల్లనే 2014కు ముందు పాలనలో సాంకేతికత వినియోగంపై ఉదాసీన ఉండేదని విమర్శించారు.
మారుమూల ప్రజలకు సైతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించగలిగామని ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే వేగంతో ముందుకు సాగితే మనం అంత్యోదయ లక్ష్యాన్ని అందుకోగలమని స్పష్టం చేశారు. దీంతోపాటు జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జామ్) వినియోగం ద్వారా పేదలు తమ హక్కులు పొందేలా చేయగలమని చెప్పారు.
“దేశానికి సరికొత్త బలం… వేగం… విస్తృతి ఇవ్వడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మేము కీలక సాధనంగా మార్చాం” అని మోదీ స్పష్టం చేశారు. దేశీయంగా రూపొందించిన పటిష్ఠ ‘యూపీఐ’ ద్వారా నేడు లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అవుతున్నాయని ప్రధాని గుర్తుచేశారు. అలాగే మహిళలు, రైతులు, విద్యార్థులు నేడు ప్రభుత్వం నుంచి నేరుగా సహాయం పొందుతున్నారని తెలిపారు.
డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతటి పెను విప్లవానికి బాటలు వేస్తుందో చెప్పడానికి ‘పీఎం-స్వామిత్వ యోజన’ను ఒక ఉదాహరణగా ప్రధానమంత్రి ఉటంకించారు. ఈ పథకం కింద తొలిసారి దేశవ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ప్రతి ఆస్తినీ ‘డిజిటల్ మ్యాపింగ్’ చేసి ప్రజలకు డిజిటల్ ఆస్తి కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు.
“డ్రోన్ సాంకేతికతను ప్రోత్సహించడం అనేది సుపరిపాలన, జీవన సౌలభ్యం దిశగా మా నిబద్ధతను ముందుకు తీసుకెళ్లే మరొక మాధ్యమం. ఈ మేరకు సామాన్య ప్రజానీకం జీవితాల్లో భాగం కాగల అత్యాధునిక ఉపకరణాన్ని డ్రోన్ రూపంలో మనం పొందాం” అని ఆయన చెప్పారు.