వరుసగా రెండు దశలలో ప్రజా సంగ్రామ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం, పలువురు కేంద్ర మంత్రులు, నాయకులు హాజరై ప్రశంసలు కురిపించడం, రెండోసారి ముగింపు సభలో అయితే `కేసీఆర్ ను ఓడించడానికి సంజయ్ చాలు’ అంటూ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే సంకేతం అమిత్ షా ఇవ్వడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆనందోత్సవాలతో మునిగి పోతున్నారు.
ఇక వచ్చే ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తుందని, తానే ముఖ్యమంత్రి కాబోతున్నానని హావభావాలు ఆయనలో కనిపిస్తున్నాయి. పైగా కొన్ని సభలలో `కాబోయే సీఎం’ అంటూ కొందరు ప్రసంగిస్తున్న, నినాదాలు ఇస్తున్నా ఆయన కనీసం వారించే ప్రయత్నం చేయడం లేదు. సహజంగానే ఈ పరిణామం పలువురు సీనియర్ నేతలలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నది.
సంజయ్ సహితం నాయకత్వంకు పోటీగా భావించే వారిని దూరంగా ఉంచేందుకు, ప్రాధాన్యత ఇవ్వకుండా కట్టడి చేసేందుకు చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. దానితో మీడియాలో ఎంత హైప్ సృష్టించినా క్షేత్రస్థాయిలో బిజెపి బలం పుంజుకోలేకపోవడం సంజయ్ లో నిరుత్సాహం కలిగిస్తున్నట్లు చెబుతున్నారు.
మొదటి దశ పాదయాత్రలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరడంతో, రెండో దశలో ఎందరో కీలక నాయకులు చేరబోతున్నారని ఎంతో ప్రచారం చేసినా ఒక్కరు కూడా చేరలేదు. దానితో `ఇతరులు వస్తే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందనే ధోరణి మానుకోండి’ అంటూ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా బహిరంగంగానే రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని మందలించారు.
తెలంగాణాలో తామే అధికారంలోకి రాబోతున్నామని బిజెపి నేతలు ఎంతగా సంబర పడిపోతున్నాయి క్షేత్రస్థాయిలో ప్రజలను కదిలించే నేతలు ఎక్కువగా లేరనే విమర్శలు ఉన్నాయి. తమకంటూ సొంతంగా ఓ నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గంలో గ్రామస్థాయిలో బలమైన అనుచరులు గల నాయకులు ఐదారుమందికి మించి లేరని సీనియర్ నాయకులు అంగీకరిస్తున్నారు.
ఇతర పార్టీల నుండి వచ్చిన వారిలో జనంతో సంబంధం లేని నేతలను దగ్గరకు తీసి, అందలం ఎక్కిస్తూ, జనంతో సంబంధం ఉన్న నేతలను నిరుత్సాహ పరుస్తున్నారని అపవాదు కూడా జాతీయ నాయకత్వంకు చేరినట్లు తెలుస్తున్నది. “మాకేమి పెను చెప్పడం లేదు” అంటూ పలువురు నేతలు నేరుగా అమిత్ షా ముందే ప్రస్తావించారని తెలిసింది.
తెలంగాణలోని పార్టీ వ్యవహారాల పట్ల గతంలోనే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే విసుగు చెందిన అమిత్ షా రాష్ట్ర నాయకత్వంపై వచ్చిన ఫిర్యాదులను సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ దృష్టికి తీసుకెళ్లి, ఆయననే ఆ విషయాలు చూడమని పురమాయిస్తున్నారు. తాను మాత్రం ఎన్ని ఫిర్యాదులు వచ్చినా మౌనం వహిస్తున్నారు.
కేంద్ర నాయకత్వం ఆదేశంపై ఎస్సి, ఎస్టీ నియోజకవర్గాలలో ఇన్ ఛార్జ్ లను నియమించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారింపమని ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేసినా, దానిని అమలు చేయడం లేదు. కనీసం పలు నియోజకవర్గాలలో ఇన్ ఛార్జ్ లను నియమించలేదు. ఇన్ ఛార్జ్ లను నియమిస్తే, తామే కాబోయే పార్టీ అభ్యర్థులం అనుకోని పాతుకు పోతారనే భయంతో నియమించడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి.
కీలకమైన రాష్ట్ర నేతల మధ్య అవగాన, సమాలోచనలు లోపించడంతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ముందడుగు వేయడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రజలలో పట్టుగల నేతలను దగ్గరకు రానీయకుండా, తాము తప్ప మరో ఓట్ తెలీని వారికి ప్రాధాన్యత ఇస్తూ, పార్టీ ప్రభావాన్ని వ్యాపించలేక పోతున్నట్లు స్పష్టం అవుతున్నది.
పార్టీలో నెలకొన్న పరిస్థితులపై తన ఆగ్రవేశాలను సంజయ్ ఇటీవల పార్టీ అధికార ప్రతినిధులపై వ్యక్తం చేసారని చెబుతున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో అధికార ప్రతినిధులు సఫలం కావడం లేదని అంటూ అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆయన ధోరణి చూస్తుంటే కేవలం `మీడియా మానేజ్మెంట్’ ద్వారానే అధికారంలోకి రావాలని, నియోజకవర్గాల స్థాయిలో పార్టీని నడిపించే నాయకత్వం కోసం ప్రయత్నం చేయనవసరం లేదన్నట్లు ఉన్నాడని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.