దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ అత్యాచార కేసులో ఓ ఎమ్యెల్యే కొడుకు నిందితుడని స్పష్టం చేస్తూ బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు శనివారం ఫోటోలు విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెబుతూ పోలీసులు అరెస్ట్‌ను ఎందుకు చూపించడం లేదంటూ ఆయన నిలదీశారు.
తన వద్ద ఉన్న ఆధారాలను డిజిపికి ఇస్తానని చెబుతూ ఎల్యేయే కొడుకు లేదని పోలీసులే ఏ విధంగా తీర్పు ఇస్తారని ప్రశ్నించారు. మైనర్‌పై సామూహిక అత్యాచార కేసులో.. పోలీసులు లీకులు ఇచ్చారే తప్ప అరెస్టులు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక వేళ ఇది జరగకుంటే తానే స్వయంగా సుప్రీంకోర్టకు వెళ్తానని ఆయన వెల్లడించారు.
అవసరమైతే టీఆర్ఎస్ వాళ్లును రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎంను ఎందుకు చేయరు? అంటూ ఎద్దేవా చేశారు. “రెడ్ కలర్ మెర్సిడెస్ బెజ్ కారులో ఈ ఘటన జరిగింది. కానీ పోలీసులు ఇన్నొవాలో ఉన్నవారిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, హోంమంత్రి మనవడు ఉన్నారు. రెడ్ కల్లర్ బెంజ్ కారులో ఏం జరిగిందో మా దగ్గర వీడియోలు ఉన్నాయి” అని స్పష్టం చేశారు.
“పొటోలు, వీడియోలు మా వద్ద ఉన్నాయి. రెడ్ కలర్ కారులో ఉంది ముమ్మాటికీ ఓ ఎమ్మెల్యే కొడుకే!. నిందితుల ఫొటోలను ఎందుకు రహస్యంగా ఉంచారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాం” అని హెచ్చరించారు. హైదరాబాద్‌లో పోలీసింగ్.. మజ్లిస్ చేతిలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందే అని డిమాండ్ చేశారు.
బాధితుల తరపున మాట్లాడితే కేసులు పెడతామంటున్నారని బిజెపి ఎమ్యెల్యే మండిపడ్డారు. “మమ్మల్ని కాదు.. తప్పులు చేసిన వారిని అరెస్ట్ చేయండి” అంటూ హితవు పలికారు. ఈ ఘటనలో ఫోటోలను, నిందితుల పేర్లను ఎందుకని రహస్యంగా ఉంచారో చెప్పాలని కోరారు. ఎందుకని అరెస్టులు చూపలేదని నిలదీశారు.