భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. జూన్ 15న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు వేసేందుకు జూన్ 29, నామినేషన్ల ఉపసంహరణకు జులై 2 తుదిగడువు నిర్ణయించారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది.
జులై 21న రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కించనున్నారు. రహస్య బ్యాటెట్ పద్దతిలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఐదేళ్ల పదవీకాలం జూలై 24న ముగియనున్నందున జూలైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత రాష్ట్రపతి పదవి కాలం పూర్తయ్యేలోపు తదుపరి రాష్ట్రపతికి ఎన్నిక జరగాలి. రాష్ట్రపతి ఎన్నిక అనంతరం ఆగస్టులో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.2017లో రాష్ట్రపతి ఎన్నికలు జూలై 17న జరిగాయి. కౌంటింగ్ జూలై 20న జరిగింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను అభ్యర్థిగా నిలబెట్టాయి. పాలకవర్గం కోవింద్‌కు 661,278 ఓట్లు రాగా, కుమార్‌కి 434,241 ఓట్లు వచ్చాయి. రామ్ నాథ్ కోవింద్ 65.35 శాతం సాధించి భారతదేశానికి 14వ రాష్ట్రపతి అయ్యారు.
భారత రాష్ట్రపతిని 776 మంది పార్లమెంటేరియన్లు, 4,120 మంది శాసనసభ్యులు ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు.ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా.. బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి.