కొత్త సైనిక రిక్రూట్మెంట్ స్కీమ్ పథకంపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ..వెనక్కు తగ్గేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకంపై సందేహాలను నివృత్తి చేసింది. పోలీసు కేసులను ఎదుర్కొనే అభ్యర్థులెవరూ అగ్నిపథ్ కోసం దరఖాస్తు చేసుకోలేరని సైనిక వ్యవహారాల అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ స్పష్టం చేశారు.
అగ్నిపథ్ పథకాన్ని వెనక్కు తీసుకునేది లేదని తేల్చి చెబుతూ ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. సాయుధ బలగాల్లోకి నియామకాల కోసం దేశానికి ఈ విధానం ఎందుకు అవసరమో తెలిపారు. 1999 కార్గిల్ యుద్ధంపై ఓ కమిటీ నివేదికను ఉటంకిస్తూ.. ఆ సమయంలో ఆ యుద్ధంలో పాల్గన్న సైనికులు 30 ఏళ్లలో ఉన్నారని, ఆ వయస్సు అంశం ఆందోళనకరంగా మారిందని అనిల్ పూరీ పేర్కొన్నారు.
నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయని అగ్నిపథ్ పథకంలో రాయితీ ఇవ్వలేదని, ఇప్పటికే ఆ పనిని పూర్తి చేసినట్లు చెప్పారు. సాయుధ బలగాలు క్రమశిక్షణ కలిగి ఉంటాయని, అగ్నిపథ్ తీసుకు రాగా, ఇటువంటి నిరసనలు ఊహించలేదని విస్మయం వ్యక్తం చేశారు. అందుకే బలగాలను మరింత యవ్వనంగా తయారు చేయాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.
యువత ఆందోళనల్లో పాల్గొనవద్దని హెచ్చరిస్తూ సైన్యానికి క్రమశిక్షణ తప్పనసరి. విధ్వంసాలకు పాల్పడిన వారికి సైన్యంలో చోటులేదని స్పష్టం చేశారు. త్రివిధ దళాల్లో ఇకపై సాధారణ నియామకాలు ఉండవని, అగ్నిపథ్ ద్వారానే ఇకపై నియామకాలు జరుగుతాయని కూడా తేల్చి చెప్పారు.
విదేశీ దళాలను సైతం పరిశీలించామని పేర్కొన్నారు. యువత కావాలని భావించామని, వారైతే..అభిరుచితో.. రిస్క్తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారని అనిల్ పూరీ వెల్లడించారు. ‘‘అగ్నిపథ్‌పై రెండేళ్లుగా అధ్యయం చేశాము. అగ్నిపథ్‌పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారు. 1989 నుంచి అగ్నిపథ్ పెండింగ్‌లో ఉంది. సగటు వయస్సును తగ్గించేందుకు సంస్కరణలు తీసుకు వచ్చాము” అని వివరించారు.
కేవలం అగ్నిపథ్ వల్లే ఆర్మీ నుంచి సిబ్బంది బయటకు వెళ్తారన్న వాదన సరికాదని పేర్కొంటూ త్రివిధ దళాల నుంచి ఏటా సగటున 17,600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నారని తెలిపారు. వీరంతా రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారని ఎవరూ అడగడం లేదని గుర్తు చేశారు.
ఆర్మీ రిక్య్రూట్‌మెంట్ ర్యాలీ ఆగస్టు ప్రథమార్థంలో ప్రారంభమవుతుందని, డిసెంబర్ మొదటి వారంలో అగ్నివీర్లు మొదటి బ్యాచ్ వస్తుందని లెఫ్టినెంట్ జనరల్ సి బన్సీ పొన్నప్ప తెలిపారు. రెండవ బ్యాచ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉంటుందని చెప్పారు.
మొత్తం 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నౌకాదళంలో మొదటి బ్యాచ్ అగ్నివీర్స్ నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కా శిక్షణ కోసం వస్తుందని తెలిపారు.