కోనసీమ జిల్లాలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు బిల్లుకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
సచివాయలంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాల విభజనకు సంబంధించి సవరణలు, మార్పులు, చేర్పులుతో కూడిన తుది నోటిఫికేషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపారు.
అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన బద్వేలు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కొత్తగా 20 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీసీ జీవోలో చేసిన మార్పులకు సంబంధించి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నెల 27న అమలు చేయబోతోన్న అమ్మఒడి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.15వేల కోట్లతో ఏర్పాటు కానున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
యూనివర్సిటీలు, కార్పొరేషన్, సొసైటీ ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపుజేస్తూ గతంలో మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 70 యేళ్లు పైబడ్డ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జూలై 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేయకూడదని, పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ మరణిస్తే అంతిమసంస్కారాల ఖర్చుల కింద ఇచ్చే మొత్తాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతూ మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.