సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్, గుజరాత్ రిటైర్డ్ డిజిపి ఆర్ బి శ్రీకుమార్ లను గుజరాత్ తీవ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్) పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తీస్తాను ముంబై లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకోగా, శ్రీకుమార్ గాంధీనగర్ లోని ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు.
2002 గుజరాత్ నరమేధం కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే ఈ అరెస్టులు జరిగాయి. గుజరాత్ నరమేధం కేసుకు సంబంధించి నకిలీ పత్రాలను తయారు చేశారనే ఆరోపణలతో తీస్తా సెతల్వాద్, పోలీసు మాజీ అధికారులు ఆర్బి శ్రీకుమార్, సంజీవ్ భట్‌లపై అహ్మదాబాద్ సిటీ క్రైం బ్యాచ్‌లో శనివారం ఉదయం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కాగా, 1990 కస్టడీ మృతి కేసులో సంజీవ్ భట్ జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ట దిగజార్చడానికి తీస్తా సెతల్వాద్ ప్రయత్నిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం ఉదయం ఆరోపించగా..ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆమెను గుజరాత్ పోలీసులు ఆమెను నిర్భంధంలోకి తీసుకోవడం గమనార్హం.
2002 గుజరాత్ నరమేధం కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపి ఇషాన్ జఫ్రి భార్య జకియా జఫ్రి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లో తీస్తా సెతల్వాద్‌కు చెందిన ఎన్‌జిఒ సహ పిటిషనర్‌గా ఉన్నారు.
స్వచ్ఛంద సంస్థకు విదేశీ నిధులను సమీకరించిన కేసులో విచారించేందుకే సెతల్వాడ్ ను ఏటీఎస్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏటీఎస్ బృందం సెతల్వాడ్ ఇంట్లోకి శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా దూసుకొచ్చి, కొట్టి అదుపులోకి తీసుకున్నారని ఆమె తరఫు న్యాయవాది ఆరోపించారు.
కాగా, శనివారం ఉదయం ఓ వార్తా సంస్థకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై తీస్తా సెతల్వాడ్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ పోలీసులకు ఆనాడు నిరాధారమైన సమాచారాన్ని అందించిందని మండిపడ్డారు.
‘‘ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సంచలనం చేయడానికి ప్రయత్నించారు. వారంతా అల్లర్ల విషయంలో సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన అధికారులను జైల్లో పెట్టాలి” అంటూ జకియా జాఫ్రీ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ, ప్రధాని మోదీకి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సమర్ధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు ప్రేకొన్నది.
పైగా, సొంత ప్రయోజనాల కోసం తీస్తా సెతల్వాడ్ ఈ కేసును వాడుకున్నారని, ఆమెపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. సుప్రీం కోర్ట్ తీర్పు అనుసరించే తాజాగా ఈ కేసు నమోదు చేసిన్నట్లు తెలుస్తున్నది.