శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసి, మూడింట రెండు వంతుల మంది ఎమ్యెల్యేలను గౌహతిలోని ఓ స్టార్ హోటల్ కు తరలించిన ఆ పార్టీ సీనియర్ నేత ఏకనాథ్ షిండే తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు శివసేన రంగం సిద్ధం కావడంతో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది.
ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత నోటీసులు పంపి, సోమవారంనాటికి సమాధానాలు సమర్పించాలని ఆదేశించారు. ఇప్పుడేమి చేయాలో అన్నదానిపై సందిగ్థలో పడినట్లు కనిపిస్తున్నది. డిప్యూటీ స్పీకర్ ఎన్సీపీకి చెందిన వ్యక్తి కావడంతో 16 మందిపై అనర్హత వేటు వేస్తే తమ తిరుగుబాటు అంతా వృధా ప్రయత్నం అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
పైగా, శాసన సభ్యత్వం కూడా కోల్పోతే మిగిలిన తిరుగుబాటు ఎమ్యెల్యేలు అందరూ జారుకునే అవకాశం ఉంది. కోర్టును ఆశ్రయించినా అప్పట్లో తేలే అంశం కాదు. అనర్హత అంశాలకు సంబంధించిన పిటీషన్లు దేశంలో ప్రస్తుతం నాలుగు హైకోర్టులలో పెండింగ్ లో ఉన్నాయి.
ఈ విషయమై గౌహతిలో తాము ఉంటున్న హోటల్ కు సీనియర్ న్యాయ నిపుణులను పిలిపించి, వారి నుంచి న్యాయ సలహాలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఎంతసేపు తననే సభానాయకుడిగా గుర్తించమని కోరడమే గాని, ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానాన్ని గవర్నర్ కు పంపే ప్రయత్నం చేయడం లేదు. ఆ విధంగా చేస్తే, అసెంబ్లీలో బలపరీక్షకు మార్గం సులభం అవుతుంది.
అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చకు తీసుకు వచ్చి, వోట్ వేయాలంటే శివసేనతో చీలిక తీసుకు వచ్చామంటున్న తిరుగుబాటు ఎమ్యెల్యేలో మరో పార్టీలో చేరవలసి ఉంటుంది. ఆ విధంగా చేరకుండా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా అనర్హతకు గురికావలసి ఉంటుంది. అటువంటప్పుడు బీజేపీలో విలీనం కావడమే మార్గం కాగలదు.
బీజేపీలో విలీనమైతే తమదే `నిజమైన శివసేన’, `బాబాసాహెబ్ హిందుత్వం’ కోసమే ఈ తిరుగుబాటు అంటూ ఇప్పటివరకు చేస్తున్న వాదనలు వీగిపోతాయి. అప్పుడు ప్రజల నుండి తీవ్ర ప్రతికూలతను ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్ధవ్ థాకరే వ్యూహాత్మకంగా శివసేన శ్రేణులకు భావాత్మకంగా విజ్ఞప్తులు చేస్తూ, మొన్నటి వరకు తిరుగుబాటు నేతలను సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఆయన ఇప్పుడు కఠినంగా మాట్లాడుతున్నారు. ఈ మాటల ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తిరుగుబాటు ఎమ్యెల్యేల కార్యాలయాలు, ఇళ్ళపై శివ సైనికులు దాడులు చేయడం ప్రారంభమైనది.
శివసేన నాయకత్వం మొత్తాన్ని చేజిక్కించుకోవాలని ఏక్ నాథ్ షిండే భావిస్తే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఎదుట అందుకు తగిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే శివసేన క్షేత్ర స్థాయి కార్యకర్తల మద్దతు తమకే ఉందని ఉద్ధవ్ థాక్రే చెబుతున్నారు. అధి నాయకత్వంపై తిరుగుబాటు చేసే హక్కు పార్టీ శ్రేణులకు లేదని స్పష్టం చేస్తున్నారు.
మొదట్లో తమకు `ఓ జాతీయ పార్టీ’ అండదండలు ఉన్నాయని ప్రకటించిన షిండే ఆ తర్వాత మాట మార్చారు. ఇప్పుడు తమకు బిజెపి మద్దతు లేదంటూ తిరుగుబాటు ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ ప్రకటించడం గమనార్హం. శివసేనను బిజెపి అవమానాలకు గురిచేస్తూ వచ్చినదని చెప్పడం ద్వారా తిరుగుబాటు నేతలపై పరోక్షంగా థాకరే వత్తిడులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.