రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. సోమవారం విపక్ష పార్టీల నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. అధికార పక్షం ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హాతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతరామ్ ఏచూరి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌తోపాటు పలువురు విపక్షనేతలు ఉన్నారు.
పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీకి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందించారు. ఆమ్ఆద్మీ పార్టీ, ఝార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీలు మాత్రం తమ ప్రతినిధులను పంపలేదు.
సిన్హా శుక్రవారం మాట్లాడుతూ, తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, మహిళలు, అణగారిన వర్గాల కోసం గళమెత్తుతానని చెప్పారు. తనను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ మార్గదర్శకాలను, మౌలిక విలువలను నిర్భయంగా, రాగద్వేషాలు లేకుండా అమలు చేస్తానని తెలిపారు.
యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి చివరి నిమిషంలో టిఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఈ ఉదయం ఆ మేరకు ప్రకటన చేసింది. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లే విషయం, అభ్యర్థిని ఎంచుకునే విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. చివరకు విపక్షాలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంది. దానిలో భాగంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి కెటిఆర్ హాజరయ్యారు.