వారం రోజులకు పైగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ముగింపు పలకడానికి బిజెపి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది. శివసేన తిరుగుబాటు నాయకుడు ఎకనాథ్ షిండేతో కలసి ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి రంగం సిద్ధం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ విషయమై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్లి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఫడ్నవీస్ నివాసంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ భేటీ అనంతరం ఆయన బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబట్టేలా ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు సాగుతోందని తెలుస్తోంది.
మరోవైపు ఏక్ నాథ్ షిండే కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. బీజేపీ అగ్రనేతలను ఆయన కలువనున్నారని సమాచారం. అనంతరం ముంబాయికి వెళ్లి నేరుగా గవర్నర్ ను కలిసి రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు బలం నిరూపించుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరేవిధంగా రంగం సిద్ధం చేస్తున్నారు.
తామే అసలైన శివసేన వారసులమని, శివసేన పార్టీ తమదేనని షిండే స్పష్టం చేస్తున్నారు. 40 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని. పార్టీ శాసనసభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో ఇప్పటికే ఈ విషయం స్పష్టం చేశారు.
బాల్‌థాకరే హిందూత్వాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ముంబయికి చేరుకోనున్నట్లు శివసేన ఏక్నాథ్ షిండే మంగళవారం స్పష్టం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా బస చేసిన గువహటి హోటల్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు.
ఎమ్మెల్యేలంతా తమ గుర్తింపు కోసం, హిందూత్వ కోసం, ఇష్టపూర్వకంగానే గువహటికి వచ్చారని, త్వరలో ముంబయి చేరుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్ధవ్‌థాకరే ప్రభుత్వం మైనార్టీలో పడిందని, తనకు 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించారు.
ఉద్ధవ్ బహిరంగ లేఖ
మరోవంక, శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని ఆ పార్టీ చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోరారు. ఒక కుటుంబ పెద్దగా రెంబల్ క్యాంప్ పట్ల తాను ఆవేదనతో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు ఆయన మంగళవారంనాడు ఒక బహిరంగ లేఖ రాశారు.
“…. మనస్ఫూర్తిగా మీరంతా శివసైనికులే. మీ కుటుంబ సభ్యులు కొందరు నన్ను సంప్రదించారు. వారి భావోద్వోగాలను కూడా నాతో పంచుకున్నారు. శివసేన కుటుంబ పెద్దగా మీ అందరి మనోభావాల పట్ల నాకు గౌరవం ఉంది” అని ఆ లేఖలో ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు.
రెబల్ క్యాంప్ నాయకుడిగా చెప్పుకుంటున్న ఏక్నాథ్ షిండేను పరోక్షంగా ఉద్ధవ్ ప్రస్తావిస్తూ, ఎవరో చేసిన పొరపాటుకు వారి వలలో చిక్కుకోవద్దని రెబల్ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. శివసేన ఇచ్చిన గౌరవం ఇంకెక్కడా దొరకదని, మీరు ముందుకు వచ్చి, మాట్లాడితే, మార్గం సుగమమవుతుందని ఆయన సూచించారు.
”గందరగోళానికి స్వస్తి చెప్పండి. తప్పనిసరిగా దీనికొక పరిష్కార మార్గం ఉంది. మనం కలిసి మాట్లాడుకుందాం. ఒక అవగాహనకు వద్దాం. శివసేన పార్టీ చీఫ్‌గా, కుటుంబ పెద్దగా ఇప్పటికీ మీ గురించి ఆవేదన చెందుతున్నాను. ముందుకు రండి, పరిశీలించండి, హాయిగా ఉండండి” అని ఉద్ధవ్ ఆ లేఖలో రెబల్ ఎమ్మెల్యేలకు సూచించారు.
