బీహార్ లోని అసదుద్దీన్ ఒవైసి నాయకత్వంలోని ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్యెల్యేలో నలుగురు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో బుధవారం చేరారు. దానితో బీహార్ అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల శాఖ 80కు పెరగడంతో అతిపెద్ద పార్టీగా మారింది.
అంతకు ముందు 76 మంది ఎమ్యెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీని దాటుకొని వికాశీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)కి చెందిన ఎమ్మెల్యేలు చేరడంతో బిజెపి సభ్యుల సంఖ్య 77కు పెరిగి, అతిపడ్డ పార్టీగా మారిందితాజా పరిణామంతో తిరిగి అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ ఆవిర్భవించింది. ఈ విలీనం గురించి తెలియజేసేందుకు తేజస్వి యాదవ్ తన సొంత కారులో నలుగురు ఎమ్మెల్యేలను తీసుకుని స్పీకర్ను కలిసేందుకు వెళ్లారు.
ఆర్జేడీలో చేరిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యేల్లో మహ్మద్ ఇజార్ అర్ఫీ, షానవాజ్ ఆలం, రుకానుద్దీన్ అహ్మద్, అంజార్ నైమి ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి బిహార్లో ఒకే ఒక ఎమ్మెల్యే అయిన అక్తరుల్ ఇమాన్ మిగిలారు. అతను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.
ఏఐఎంఐఎం ఎమ్యెల్యేలు ఆర్జేడీతో చేరబోతున్నారని కొంతకాలంగా వినిపిస్తున్నా తాజా మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేగవంతంగా జరిపినట్లు తెలుస్తున్నది. అందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చెందిన జెడియు పరోక్ష ఎత్తుగడ కూడా ఉన్నట్లు చెప్పుకొంటున్నారు.
మహారాష్ట్ర దారిలో బిజెపి – జేడీయుల మధ్య కూడా చీలిక ఏర్పడితే, గవర్నర్ అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించవలసిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలను అన్వేషించే అవకాశం బిజెపికి ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
కాగా, ఆర్జెడి నేతృత్వంలోని మహా కూటమి మెజార్టీ మార్కుకు కేవలం ఏడుగురు ఎమ్మెల్యేల దూరంలో ఉంది. 243కు గాను మహాకూటమికి ఇప్పుడు 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమిలో కాంగ్రెస్కు 19, సిపిఐ(ఎంఎల్)కు 11, సిపిఎంకు 3, సిపిఐకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.