రెండు దశాబ్దాల తర్వాత జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. కరోనా మహమ్మారి మొత్తం దేశాన్ని కకావికలం కావించిన తర్వాత – రెండున్నరేళ్ల తర్వాత మొదటిసారిగా పూర్తి స్థాయిలో బిజెపి జాతీయ నేతలు అందరు ఓ చోట సమావేశం అవుతున్నారు. జెపి నడ్డా పార్టీ సారధ్యం వహించిన తర్వాత మొదటిసారిగా ఈ సమావేశాలు ఈ స్థాయిలో జరుగుతున్నాయి.
ఈ సమావేశాలను హైదరాబాద్ లో ఓ విడిదిగా జరపడం కాకుండా, భారీ లక్ష్యాలు, రాజకీయ వ్యూహాలతో జరపాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఇప్పుడు మొత్తం పార్టీ దృష్టి 2024 నాటి ఎన్నికలపైనే ఉన్నదన్నది అందరికి తెలిసిందే.
2014 ఎన్నికలలో కన్నా, 2019 ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బిజెపి ఈ పర్యాయం ఇంకా ఎక్కువ స్థానాలను గెల్చుకోవడమే కాకుండా, ఇప్పటి వరకు పార్టీ అంతగా విస్తరింపని ప్రాంతాలకు విస్తరింపడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.
మరోవంక, మనం 75వ స్వతంత్ర – ఆజాద్ కా అమృతోత్సవం వేడుకలను జరుపుకొంటున్నాము. ఈ సందర్భంగా `నూతన భారత్’ కోసం దేశ ప్రజలను సమాయత్తం కావిస్తూ,, వచ్చే 25 ఏళ్లలో దేశాభివృద్ధికి కార్యప్రణాళినకు రూపొందించే విధంగా అన్ని వర్గాల ప్రజలకు, వ్యవస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శనం చేస్తున్నారు. అటువంటి చారిత్రక నేపథ్యంలో ఇక్కడ బిజెపి సమావేశాలు జరగడం ముదావహం.
2014లోనే బిజెపి అధ్యక్ష పదవిని చేపట్టగానే ఇప్పటివరకు బిజెపి అధికారంలోకి రాలేని దక్షిణాది రాష్ట్రాలతో పాటు తూర్పు ప్రాంతంలో ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయడం పట్ల దృష్టి సారించారు. కర్ణాటకలో తప్పా మరెక్కడా ఈ రాష్ట్రాలలో బిజెపి ఎప్పుడు అధికారంలోకి రాలేదు. ఒడిశాలో బిజెడి ప్రభుత్వంలో, ఏపీలో టిడిపి ప్రభుత్వంలో కొంతకాలం భాగస్వామిగా మాత్రం ఉంది.
ఆ తర్వాత అస్సాం, త్రిపురలతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాలలో బిజెపి అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లో అధికారం కోసం గత ఏడాది పెద్ద ప్రయత్నం చేసింది. సుదీర్ఘకాలం ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, సిపిఎంలను ఉనికి లేకుండా చేసి, నేడు కీలకమైన ప్రతిపక్షంగా ఉంది. ఇక ఆ రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదే అనడంలో సందేహం లేదు.
ఇప్పుడు మొత్తం బిజెపి నాయకత్వం దృష్టి తెలంగాణపై పడింది. దేశం మొత్తం మీద బిజెపి రాబోయే రోజులలో మొదటిసారిగా అధికారంలోకి రాగాల రాష్ట్రంగా తెలంగాణను గుర్తించారు. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలు, జిహెచ్ఎంసి ఎన్నికలలో సాధించిన అనూహ్య విజయాలే అటువంటి భరోసా కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు జరిపినా అధికారంలోకి వచ్చెడిది బీజేపీయే అన్న ధీమాతో పార్టీ ఇప్పుడు అడుగులు వేస్తున్నది.
అందుకనే ఈ రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తున్నది. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా జరగబోయే బహిరంగ సభ ఈ దిశలో ఓ స్పష్టమైన సందేశాన్ని ఇవ్వనున్నది. కేవలం బహిరంగసభలకు, ప్రచారాలకు పరిమితం కాకుండా ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను జాతీయ నాయకత్వం పర్యవేక్షిస్తుంది.
దేశం మొత్తం మీద బిజెపి బలహీనంగా ఉన్న 144 లోక్ సభ నియోజకవర్గాలను పార్టీ నాయకత్వం గుర్తించింది. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణంను పర్యవేక్షిస్తూ వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం చేయడానికి సిద్దపడుతోంది.
మరోవంక, మొన్ననే నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ కాలంలో ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, దేశం స్థితిగతులను మార్చిన కీలకమైన నిర్ణయాలు, సాహసోపేతమైన విధానాల గురించి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలకు సవివరంగా వివరించే ప్రయత్నం జరిగింది.
కరోనా మహమ్మారి కారణంగా ఆర్ధికంగా ఎదురైనా ఎదురు దెబ్బల నుండి ప్రపంచంలోని సంపన్న దేశాలకన్నా వేగంగా భారత్ క్రమంగా కోలుకొంటున్నాము. భారతదేశం అత్యంత వేగంగా చేపట్టిన టీకాల కార్యక్రమం ద్వారా దేశంలో 42 లక్షల మంది మృత్యువాతను తప్పించుకున్నారని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి.
ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగ నీయమకాలు, అగ్నిపథ్ ద్వారా సైన్యంలోకి ఎంపికలు చేపడుతున్నారు. మరోవంక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పెత్తఎత్తున ప్రోత్సాహకాలు అందుబాటులోకి వస్తున్నాయి. తద్వారా భారతీయ యువతకు ఉజ్వలమైన భవిష్యత్ కు మార్గాలు ఏర్పడుతున్నాయి.
రాష్ట్రపతి అభ్యర్థిగా అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన గిరిజన మహిళా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం ఓ విధంగా సాహసోపేత నిర్ణయమే కాగలదు. అట్టడుగు, అణగారిన వర్గాల సాధికారత కోసం ఏ విధంగా దృష్టి సారిస్తున్నారో వెల్లడి చేస్తుంది. ఇటువంటి సానుకూల అంశాలతో ప్రజలలోకి మరింతగా చొచ్చుకుపోయి విధంగా హైదరాబాద్ లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశం పార్టీకి దిశా, నిర్ధేశం కావింపనున్నది.
సుదీర్ఘమైన మేధోమధనం సైన్యంలోకి ఎంపికలో సమూల సంస్కరణలకు అవకాశం కల్పించే విధంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ విధానం పట్ల యువతలో ఆగ్రవేశాలు నింపడం కోసం కొన్ని ప్రతిపక్షాలు ప్రయత్నం చేసినా ఎక్కువ రోజులు నిలబడలేదు. వాస్తవాలు గ్రహించి, ప్రభుత్వ ఉద్దేశ్యాలను అర్థం చేసుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల పట్ల అపోహాలు కలిగించడంలో పాక్షికంగా విజయవంతమైన ప్రతిపక్షాలు నిరసన ఉద్యమాలు తీవ్రంగా ఉన్న ఉత్తర ప్రదేశ్ లోని ప్రాంతాలలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, హర్యానాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రైతు ఉద్యమం తీవ్రంగా కొనసాగిన పట్టణాల్లో సహితం విజయాలు సాధించడం గమనార్హం. క్రమంగా ప్రజానీకం ప్రతిపక్షాల కుయుక్తులను అర్థం చేసుకొంటున్నారని స్పష్టం అవుతున్నది.
ఒడిశాలో ప్రస్తుతం బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తెలంగాణాలో పేరుకు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి ఓట్ వేస్తే, గెలుపొందిన వారు ఆ తర్వాత అమ్ముడు పోతారని ప్రజానీకం తెలుసుకున్నారు. దానితో బిజెపి మాత్రమే కేసీఆర్ అరాచక పాలన నుండి తమకు విముక్తి కలిగించగలదని గ్రహిస్తున్నారు. బిజెపి కార్యక్రమాలు లభిస్తున్న అనూహ్య స్పందన ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నది.
ఈ సంవత్సరం చివరిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో, వచ్చే ఏడాది కర్ణాటక, తెలంగాణలతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దృష్ట్యా హైదరాబాద్ లో జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు రాజకీయంగా కీలకం కానున్నాయి. పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం, కార్యాచరణ ప్రణాళికలను ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రాలలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు అనుసరించే విధానాలకు మార్గదర్శనం కూడా చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే దేశంలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాలలో దేశ ప్రజలకు పిలుపిచ్చారు. ఈ పిలుపుకు ప్రజల నుండి నిర్ణయాత్మక స్పందనలు ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము. ఈ పిలుపు కారణంగా దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న కాంగ్రెస్ నిస్తేజంగా మారుతున్నది. మహారాష్ట్రలో శివసేన పరిస్థితితో పాటు, తెలంగాణలోని టి ఆర్ ఎస్ సహితం సొంత శ్రేణుల నుంచి తిరుగుబాటు ధోరణులను ఎదుర్కొంటున్నాయి.
దేశంలో జాతిహితం, ప్రజల శ్రేయస్సు, దేశ అభివృద్ధి లక్ష్యంగా విధానపరమైన రాజకీయాల కోసం బిజెపి ఆరాటపడుతుంది. కేవలం బిజెపి ఆ దిశల్లో నడుచుకోవడమే కాకుండా దేశంలో అన్ని రాజకీయ పక్షాలు సహితం ఆ విధంగా వ్యవహరింపలేని కోరుకుంటున్నది. అందుకోసం ప్రజల నుండే వత్తిడులను నేడు పలు రాజకీయ పక్షాలు ఎదుర్కొంటున్నాయి.