తెలంగాణ ప్రజల్లో బిజెపిపై నమ్మకం పెరుగుతోందని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సామవేశాల ముగింపు సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బిజెపి విజయ సంకల్ప బహిరంగ సభలో సభలో ఆయన తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తీరుతుందని భరోసా వ్యక్తం చేసారు.
బిజెపిని ఆశీర్వదించేందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణలో సత్వర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ప్రతి పట్టణం, పల్లె అభివృద్ధి చెందుతాయని ప్రధాని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానన్న మోదీ, రాష్ట్ర అభివృద్ధే బిజెపి ప్రాధాన్యత అని ప్రకటించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం రాష్ట్ర ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
బిజెపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని చెబుతూ బడుగు, బలహీన వర్గాల కోసం బిజెపి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రతి పేద,బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర పథకాలు అందుతున్నాయని, ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించామని వివరించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రంతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.
2019 ఎన్నికల్లో బిజెపికి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారని చెబుతూ అప్పటి నుండి ప్రతి ఎన్నికలలో ప్రజల మద్దతు పెరుగుతూ వస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసీలు, పేదల ఆకాంక్షలను బిజెపి నెరవేర్చిందని అంటూ హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు.
తెలంగాణాలో మెగా టెక్సటైల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నామని చెబుతూ మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరిగిందని అంటూ దేశ వ్యాప్తంగా తెరిచిన 47 కోట్ల జన్ ధన్ ఖాతాలలో ఓ కోటి మేరకు తెలంగాణవే అని చెప్పారు.
కొత్త జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొంటూ తెలుగులో సాంకేతిక విద్య, వైద్య విద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారమవుతాయని తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించామని, తెలంగాణలో రూ.35 వేల కోట్లతో ఐదు భారీ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు.
తెలంగాణలో ప్రతి పల్లెకు రోడ్డు అనుసంధానం చేస్తున్నామని, రైతుల హైదరాబాద్‌లో రూ 1500 కోట్లతో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌లు నిర్మిస్తున్నామని ప్రధాని తెలిపారు. రూ 350 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ కూడా కేటాయించామని చెప్పారు. తమ పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రొత్సాహం ఇస్తున్నామని ప్రధాని చెప్పారు.
తెలంగాణలో రైతులకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతూ గత ఎనిమిదేళ్లలో రూ 1 లక్ష కోట్లతో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశామని ప్రధాని వెల్లడించారు. తెలంగాణలో 5 వేల కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలను అభివృద్ధి చేశామని చెప్పారు.