మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ వచ్చే వారంలో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో సంపూర్ణ చర్చల తర్వాత మంత్రి మండలి కూర్పు ఉంటుందని తెలిపారు.
శనివారం షిండే, ఫడ్నవీస్‌లు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలుసుకున్నారు. అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెబుతున్న మాటల్ని షిండే తోసిపుచ్చారు. 164 మంది ఎమ్మెల్యేలతో తమ ప్రభుత్వం బలంగా ఉందని, పూర్తి కాలం తను పదవిలో ఉంటానని ధీమాగా చెప్పారు.
ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడం పట్ల అసంతృప్తిగా లేదా అన్న ప్రశ్నకు తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటానని బదులిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రే నాయకుడని, షిండే నాయకత్వంలో పని చేస్తామనని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని పూర్తికాలం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం హోం మంత్రి అమిత్ షాతో షిండే, ఫడ్నవీస్ సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో అధికార పంపిణీ కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. బీజేపీకి ప్రభుత్వాలు కూలగొట్టడం అలవాటని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, ఇప్పుడు అదే విమర్శ ఎందుకు రావడం లేదు?.. ఎందుకంటే.. ఇది మహారాష్ట్ర ప్రజల కోరిక కూడా. ప్రజాభీష్టం మేరకే బీజేపీతో పొత్తుకు వెళ్లామని షిండే వివరించారు.
“మహా వికాస్ అగాడి కూటమిలో శివసేన ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని మేం వాదించాం. కానీ, ఆ ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. బాలాసాహెబ్(బాల్‌థాక్రే) ఏనాడూ కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు కోరుకోలేదు. పైగా దూరంగా ఉండాలనే అంటుండేవారు” అని సీఎం షిండే పేర్కొన్నారు.
శివ సేన గుర్తు కోసం ఆయన శిబిరం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని ఆశ్రయిస్తారా? అనే ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. కాలమే సమాధానం ఇస్తుందని బదులిచ్చారు. పార్టీ గుర్తు కోసం పోరాటం అనేది తన ఒక్కడి నిర్ణయం కాదని, తోటి సభ్యులతో చర్చించాలని తెలిపారు. వాళ్లు ఎలా నిర్ణయిస్తే.. అలా ముందుకెళ్తాం అని బదులిచ్చారు.
అంతేకాదు.. శివ సేన సంక్షోభాన్ని చల్లార్చేందుకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేను ఒప్పించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, అయితే తమ అభ్యర్థనలు బెడిసికొడుతున్నాయని ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు.
