రెండేళ్ల క్రితం 60 ఏళ్ళ వయస్సులోనే జులై 18, 2020లో ఆకస్మికంగా మృతి చెందిన పూసులూరి నారాయణస్వామి ఒక సాంప్రదాయ పేద బ్రాహ్మణ కుటుంభంలో. వలస కార్మికులకు పేరొందిన మహబూబ్ నగర్ జిల్లాలో ఆగష్టు 15, 1959న జన్మించారు. ఆయన తన జీవితమంతా గల్లిలలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపైనా కూడా వలస కార్మికుల హక్కుల కోసం, వారి సాధికారికత కోసం నిర్విరామంగా పోరాడారు.
ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కార్మికులు, గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు, అసంఘటిత కాంతికుల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం జరిపారు. గల్ఫ్ దేశాలలో ఎక్కడ తెలుగు వలస కార్మికుల ఇబ్బందులలో చిక్కుకున్నారని తెలిసినా వెంటనే పరిగెత్తేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసేవారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇఎల్ఓ) వంటి సంస్థలను రంగంలోకి దింపేవారు. బహుశా అంత దూకుడుగా, అంకిత భావంతో వలస కార్మికుల మనుగడ కోసం పోరాడిన మరెవ్వరు భారత దేశంలో లేరని చెప్పవచ్చు.
యువకుడిగానే పలు ప్రజా ఉద్యమాల్లో, విప్లవ సంఘాలలో క్రియాశీలకంగా పనిచేశారు. కొండపల్లి సీతారామయ్య స్పూర్తితో అనేక ప్రజా సంఘాలలో పనిచేశారు. పీయూసీఎల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి పలు హక్కుల సంఘాలలో కూడా పనిచేశారు. హక్కుల ఉల్లంఘనలపై పలు నిజనిర్ధారణ కమిటీలలో పాల్గొనడమే కాకూండా హైకోర్టు, సుప్రీంకోర్టు లలో పలు కేసులు వేశారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ వంటి పలు అంతర్జాతీయ సంస్థలలో కూడా హక్కుల పరిరక్షణ కోసం కృషి చేశారు. పలు సార్లు గల్ఫ్ దేశాలలో పర్యటనలు జరిపి అక్కడ ఆపదలో ఉన్న కార్మికుల పక్షాన నిలబడి, మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కదలిక తీసుకు వచ్చారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చట్టాలు తీసుకు రావడానికి కృషి చేశారు.
పాలమూరు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు. దానిని తర్వాత పాలమూరు మైగ్రెంట్ లేబర్ యూనియన్ గా మార్చారు. దీని ద్వారా వలస కార్మికుల జీవనోపాధులు కాపాడటం కోసం విశేషంగా కృషి చేశారు. కరోనా సమయంలో సహితం వలస కార్మికుల సంక్షేమం కోసం విస్తృతంగా కృషి చేశారు.
బహుశా గల్ఫ్ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలలో, కేంద్ర ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో గల్ఫ్ దేశాలకు సంబంధించిన అధికారులలో నారాయణస్వామితో సంబంధం లేనివారు ఉండక పోవచ్చు. ఎడారి దేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఎందరో వలస కార్మికుల జీవితాలలో వెలుగులు నింపారు. జైళ్లలో అన్యాయంగా మగ్గుతున్న వారి విడుదలకు విశేషంగా కృషి చేశారు. విదేశీ ప్రభుత్వాలను సహితం పలు సందర్భాలలో ఒప్పించి, భారత ప్రభుత్వ అధికారులు సహితం చేయలేని విధంగా మన కార్మికులకు అండగా నిలబడ్డారు
బాలికల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా 1997లో ఆయన ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజారాజ్యంలో కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి అభాగ్య బాలికలను ఆదుకోవడం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి, చట్టాలు తీసుకు రావడానికి దారితీశాయి.
నారాయణస్వామి వేసిన కేసులోని ఎన్ కౌంటర్ లు జరిపిన వారిపై ఐపీసీ 302 క్రింద హత్య నేరం మోపి విచారణ జరపాలని ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 1996లో గోదావరిఖని లో పోలీసుల ఎన్కౌంటర్ లో రమాకాంత్ రెడ్డి చనిపోయిన సంఘటనపై ఆయన ఈ కేసును దాఖలు చేశారు. అప్పటి నుండి జాతీయ మానవ హక్కుల కమిషన్ సహితం ఎన్కౌంటర్ హత్యలకు పోలీసులను బాధ్యులను చేస్తూ వస్తున్నది.
కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు ఆయనను `శ్రమశక్తి’ పురస్కారంతో సత్కరించారు. నారాయణస్వామి శ్రీమతి జయ వింధ్యల సహితం పౌరహక్కుల ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పీయూసీఎల్- తెలంగాణకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
వ్యక్తిగతంగా నిరాడంబరమైన జీవనం గడుపుతూ, వలస కార్మికులు, అసంఘటిత కార్మికుల పక్షపాతిగా ఎందరికో మార్గదర్శకులుగా నిలిచారు. కేవలం పోరాటాలు చేయడమే కాకుండా, న్యాయస్థానాల ద్వారా ఆపదలో ఉన్నవారికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేయడమే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సమస్యలపై దృష్టి సారించి, సానుకూలంగా విధానపరమైన చర్యలు తీసుకొనేటట్లు చేయడంలో ఆయన నాయకత్వం క్రియాశీల పాత్ర వహింధించి.
ఈ పోరాటాల క్రమంలో ఎన్నో అవమానాలను చిరునవ్వుతో స్వీకరించారు. న్యాయస్థానాలలో సహితం అక్షింతలు గురయ్యారు. అయితే ఆపదలో ఉన్నవారికి ఏమాత్రమైనా మేలు జరుగక పోతుందా అంటూ న్యాయస్థానాల తలుపులు తట్టేవారు. ఎందరెందరో బాధితుల పక్షం వాదించే లెక్కలేనన్ని కేసులను కోర్టులలో వేశారు.
నారాయణస్వామి సునిశితంగా సమస్యలను అధ్యయనం చేసేవారు. పలు దేశాలలోని శ్రామికుల స్థితిగతులపై అధ్యయనం చేసే, ఆయా దేశాలలోని కార్మిక సంస్థలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వారిపై మంచి ముద్రవేశారు. భవన నిర్మాణ కార్మికుల బాధలను కళ్లారా చూడడంతో వారి కోసం తుది శ్వాస వరకు పోరాడుతూనే ఉన్నారు. చేనేత రంగాన్ని ఆడుకోవడంపైనా, ఖాయపడిన మిల్లులను బతికించడం పైన దూరదృష్టితో, నిర్మాణాత్మక వైఖరితో వ్యవహరించారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఓ బోర్డు ను ఏర్పాటు చేసినా, ఆ బోర్డులో రూ 22 కోట్లు నిధులు మూలుగుతున్న వారి సంక్షేమం కోసం తగు చర్యలు తీసుకొనక పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తుండేవారు. పాలమూరు బీడీ కార్మికులలో చైతన్యం నింపు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చట్టాలు తీసుకు వచ్చేటట్లు చేయడంలో క్రియాశీల పాత్ర వహించారు.
దేశంలోని మొత్తం కార్మికులలో 37 శాతం మంది వలస కార్మికులే. మరో 50 శాతం మందికి పైగా అసంఘటిత కార్మికులు. వీరి సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, ఎన్ని చర్యలు చేబడుతున్నా వారి జీవితాలలో వెలుగులు నింపలేక పోతున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు `వోట్ బ్యాంకు’ కాకపోవడంతో సహజంగానే రాజకీయ పక్షాలు పెద్దగా శ్రద్ద చూపడం లేదు.
అటువంటి నిస్సహాయుల పక్షాన నిలిచి, వారి సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు జరిపిన నారాయణసామి ఎప్పటికి అణగారిన, నిర్లక్ష్యంకు గురవుతున్న కార్మికుల బతుకులలో వెలుగులు నింపాలి అనుకునేవారికి స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటారు.
(మహబూబ్ నగర్ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన చింతకుంట మండలం తిమ్మాపూర్ లో ఏర్పాటు చేసిన నారాయణ స్వామి విగ్రహం)