ప్రస్తుతం పనిచేసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మీద అలిగినా పరవా లేదని, పనిచేయని వాళ్లకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనతో పాటు ఎమ్మెల్యేలు కలిసి పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు.
ఏపీలో అధికార వైసీపీ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సోమవారం జరిపిన సమీక్షలో పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షుడు, రీజనల్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదని సిఎం మండిపడ్డారు.
ఐదుగురు ఎమ్మెల్యేలు కేవలం ఐదు రోజుల్లోనే ముగించారని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ఒక్క రోజు మాత్రమే తిరిగిన వారి జాబితాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఉన్నారని చెప్పారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేవలం రెండు రోజులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు.
ఐదుగురు మంత్రులు కనీసం పది రోజులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని జగన్ తెలిపారు. మొత్తం ఎమ్మెల్యేందరి ప్రొగ్రెస్‌ను జగన్ సమీక్షలో బయటపెట్టారు. కాగా, ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు ఇస్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. సచివాలయం విజిట్ పూర్తయిన వెంటనే కలెక్టర్లు నిధులిస్తారని వెల్లడించారు.
గడపగడపకూ వెళ్లినప్పుడు ప్రజలనుంచి వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యతా పనులకోసం ఈ డబ్బు ఖర్చు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు అందించామని చెబుతూ వారి మద్దతు తీసుకుంటే.. 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేం? అని జగన్ ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలమేరకు ఇవాళ జీవో కూడా ఇచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు జరుగుతోందని చెబుతూ సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనం అని చెప్పారు.
గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెల రోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని, వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు– గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్ స్పష్టం చేసారు.