కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు మరోమారు కధనాలు వెలువడుతున్నాయి. కొంతకాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన రెండు రోజుల కిందట ఓ కేంద్ర మంత్రి, అమిత్ షాలతో చర్చలు జరిపారని అంటున్నారు.
వారిద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపారని , ఈ సమావేశానికి జార్ఖండ్‌లోని గోడా నియోజకవర్గ ఎంపీ నిషికాంత్ దూబే (బీజేపీ) మధ్యవర్తిత్వం వహించారని తెలుస్తున్నది. రాజీనామా చేసి పార్టీలోకి రావాలని రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా సూచించారని , దీనికి రాజగోపాల్ ఓకే చెప్పారని అంటున్నారు.
సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెబుతూ వస్తున్న ఆయన తాజాగా కేసీఆర్‌ను ఓడించే పార్టీలో చేరతానంటూ ఆ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. “బీజేపీ నేతలు పిలుస్తున్నారు. కానీ..నేనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్‌ను ఓడించే పార్టీ నుంచే పోటీ చేస్తా” అని చెప్పారు. అమిత్ షాను కలిసింది నిజమేనని.. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తా అని ప్రకటించారు.
పైగా, ‘‘బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడం ఖాయం. కేసీఆర్‌ను ఓడించే పార్టీలో చేరతా. నేను ఏం చేయబోతున్నానో త్వరలోనే ప్రకటిస్తా’’ అని పేర్కొనడం గమనార్హం. నల్లగొండ మునుగోడు ఎమ్మెల్యే అయిన రాజగోపాల్‌రెడ్డి.. గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు.
అయితే కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం భువనగిరి లోకసభ ఎంపిగా ఉన్నారు. పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.