ఆగష్టు 2 నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మొత్తం దృష్టి అంతా యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో జరిపే బహిరంగ సభపైననే బిజెపి శ్రేణులు సారిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొద్దీ నెలల క్రితం వరంగల్ లోనే భారీ బహిరంగ సభలో ప్రసంగించడం గమనార్హం.
ఆ సభలో పెద్ద ఎత్తున జనసమీకరణతో పాటు, పార్టీ నేతలు అందరూ ఉమ్మడిగా టి ఆర్ ఎస్ ను ఎదుర్కొని, తెలంగాణాలో అధికారంలో రావాలనే కసితో ఉన్నట్లు సంకేతం ఇచ్చారు. కేసీఆర్ కు తామే ప్రత్యామ్న్యాయం అని ప్రచారం చేస్తున్న బిజెపి ఇప్పుడు ప్రతిష్టాకరంగా తీసుకొని వరంగల్ లో రాహుల్ ప్రసంగించిన వరంగల్‌లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలోనే, అంతకన్నా రెంట్టింపు శాఖలో జనసమీకరణ జరిపి తమ ప్రాబల్యం చాటుకోవాలని పట్టుదలగా ఉన్నారు.
ఎప్పటివలెనే ఈ ముగింపు సభలో కూడా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు. ఆగష్టు 2 నుండి 26 వరకు జరిగే ఈ యాత్ర చివరిలో 26న బహిరంగ సభ జరుపనున్నారు. ఒక వంక యాత్రకు సన్నాహాలు చేస్తూనే, బహిరంగసభ ఏర్పాట్లు కూడా ఇప్పటి నుండే ప్రారంభిస్తున్నారు.
పైగా, రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు సంకేతాలు వెలువడడంతో, ఈ బహిరంగ సభను బిజెపి నాయకత్వం సహితం ప్రతిష్టాకరంగా తీసుకొనే అవకాశం ఉంది. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించిన సభ కంటే రెండింతల జనం సభకు తరలి వచ్చేలా చూడాలని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన నేతలకు నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
జాతీయకార్యవర్గ సమావేశాల సందర్భంగా సికింద్రాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభను మరిపించే విధంగా రాహుల్‌గాంధీతో త్వరలోనే రాష్ట్రంలో భారీ బహిరంగసభను నిర్వహించి సత్తా నిరూపిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎటువంటి ముందడుగు వేయలేదు.
ఈ నేపథ్యంలో మరో భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా కాంగ్రెస్, టీఆర్ఎస్లకు ధీటుగా తామే తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నామనే స్పష్టమైన సంకేతాలు ప్రజలు ఇచ్చే విధంగా బహిరంగ సభ జరపాలని చూస్తున్నారు.
ఈ సారి పాదయాత్ర మొత్తం 24 రోజుల పాటు యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో మొత్తం 328 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, జనగాం, వర్దన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో గుండా వెడుతుంది.