దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు వివిధ సోషల్ మీడియాల్లో తమ ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 91వ
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వివిధ అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు.
ఆగస్టు 2న జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించారు. త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కీలక పాత్ర పోషించారని చెప్పారు. 2 నుంచే సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ డ్రైవ్ ఆరంభించాలని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వేస్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టినట్టు గుర్తు చేశారు.
అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని ప్రధాని సూచించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఒక ఉద్యమంగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వామం కావాలని కోరారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగమై.. మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని చెప్పారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మిజార్ మేళాను వీలైతే సందర్శించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పతకాలు సాధించిన పివి సింధూ, నీరజ్ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. యుకేలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని ఆకాక్షించారు.
ఈ సందర్భగా, కర్ణాటకలో నిర్వహించిన అమృత భారతికి కన్నడ హారతి కార్యక్రమాన్ని ప్రధాని అభినందించారు. అలాగే తేనె ఉత్పత్తిలో కరావళి, మలెనాడు, ఉత్తర కన్నడ ప్రాంతాల్లో రైతులు చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసి తాలూకాలోని తేనె రైతు మధుకేశ్వర హెగ్డేను ఆయన ప్రస్తావించారు. హెగ్డే కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొంది 50 పెట్టెల తేనెటీగల పెంపకం ప్రారంభించారు. నేడు 800కు పైగా పెట్టెల్లో తేనెపట్లను పెంచుతున్నారు. మధు అంటే తేనె, ఆ పనిలో సాధన చేసి పేరును సార్థకం చేసుకొన్నారని మోదీ ప్రశంసించారు.