కరోనా మహమ్మారి, కరోనా రెండో దశ, ఒమిక్రాన్, రష్యాాఉక్రెయిన్ వంటి సమస్యలు ఎన్ని ఉన్నా ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణాన్ని 7 శాతం లేదా దాని కంటే దిగువకే ఉంచామని, దీనిని అందరూ గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హితవు చెప్పారు.
సోమవారం రాత్రి లోక్‌సభలో ధరల పెరుగుదలపై జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇస్తూ దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం లేదని భరోసా ఇచ్చారు. అయితే, మంత్రి సమాధానంతో తాము సంతృప్తి చెందలేదని కాంగ్రెస్ సభ్యులు మంత్రి ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశారు.
‘ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 7 శాతం వద్ద ఉంది. యుపిఎ పాలనలో 2004 నుంచి 2014 వరకూ కాలంలో ద్రవ్యోల్బణం రెండెంకెలకు వెళ్లింది. వరసగా 22 నెలల పాటు 9 శాతానికి పైగానే ఉంది’ అని మంత్రి గుర్తు చేశారు. ఆహార, ఇంధన ద్రవ్యోల్బణం ఎక్కుగా ఉందని ఆమె అంగీకరించారు.
అయితే, ప్రపంచంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తోందని చెబుతూ మన దేశంలో కూడా త్వరలో తగ్గుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర దేశాల కంటే భారత్ ఉత్తమంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అమెరికా జిడిపి రెండో క్వార్టర్లో 0.7 శాతం దిగజారిందని గుర్తు చేశారు.
‘దీనిని అమెరికా అనధికారి మాంద్యంగా పిలుస్తుంది. భారత్‌లో ఆర్థిక మాంద్యం వచ్చే ప్రశ్నేలేదు’ అని మంత్రి తెలిపారు. అలాగే ‘వాణిజ్య బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) ఆరేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. జిఎస్టి వసూళ్లు వరసగా 5 నెలల పాటు రూ. 1.4 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి’ అని మంత్రి చెప్పారు.
ధరల పెరుగుదలపై చర్చకు గత 10 రోజల నుంచి ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. లోక్‌సభలో దీనిపై జరిగిన చర్చలో సుమారు 20 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గన్నారు. కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ ఈ చర్చను ప్రారంబహిష్టు నోట్లరద్దు, అనాలోచిత జిఎస్టిలతో దేశ ఆర్థిక వ్యవస్థను బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.
‘జిఎస్టి పెంపుతో ప్రభుత్వం తన బడ్జెట్‌ను బలోపేతం చేసుకున్నా.. 25 కోట్ల భారతీయుల బడ్జెట్‌ను నాశనం చేసింది’ అని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కల్పించుకుంటూ.. 2013లో ఎల్పీజీ ధర రూ. 1000 దాటింద ని, ఇప్పుడే ధర తక్కువగా ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వం తమ విధానాలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచిస్తూ ఇంధన పన్నుల ద్వారానే కేంద్రం రూ 27.27 లక్షల కోట్లు వసూలు చేసిందని బిజెడి ఎంపి పినాకి మిశ్రా గుర్తు చేశారు. ఎల్పీజీ ధరలు పెరుగుదలతో సామాన్యులు పచ్చి కూరగాయలు తినాలా? అంటూ టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ సభలో పచ్చి వంకాయ ను కొరికి తింటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు.