“నన్ను రెచ్చగొట్టొద్దు రేవంత్ రెడ్డి” అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపీ, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. `కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్’ నేమ్ పై రేవంత్ చేసిన వ్యాఖ్య పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయన పేరు పెట్టి మాట్లాడాలి కానీ.. మీరు అని మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు. రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందేనని అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై తాను స్పందించేది లేదని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఏది ఉన్నా రాజగోపాల్ రెడ్డినే అడగాలంటూ మీడియాకు తెలిపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజగోపాల్ రెడ్డి తనకు ఇష్టమున్న పార్టీలోకి వెళ్లిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆర్తి కోసం తాను 34 ఏళ్ల నుంచి కష్టపడుతున్నానని వెంకట్ రెడ్డి తెలిపారు.
“‘మీరు’ అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి. పీసీసీ చీఫ్ ఇలా మాట్లాడడం తప్పు. మీరు, మీరు అంటే కోమటి రెడ్డి బ్రదర్స్ ను అన్నట్లా? వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ నిజాయితీగా ఉన్న వాళ్లే. కోమటిరెడ్డి బ్రాండ్ ను బ్రాందీ షాపు అని ఎట్లంటవ్? ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘రేవంత్ అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. నాపై ఒక్క మాట అన్నా పడే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారు. చేసిన కామెంట్లకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే పార్టీ, ప్రజలు స్పందిస్తారని హెచ్చరించారు.
పార్టీ కోసం రక్తం దారపోశానని .. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ నిజాయితీతో ఉన్న వాళ్లమే అని ఆయన స్పష్టం చేశారు. తన మీద మాట పడితే పడనని వెంకట్ రెడ్డి హెచ్చరించారు. తాము చదువుకున్న తరువాత సొంతంగా కాంట్రాక్టులు చేసుకుని పైకొచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేశారు.
రేవంత్ కామెంట్స్ తనను బాధించాయన్న ఆయన..రేవంత్ కామెంట్స్ పై ప్రజలు బాధ పడుతున్నారని చెప్పారు. అసలు నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారనేది చూస్తే..కాంగ్రెస్ కోమటిరెడ్డి కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పార్టీ పదవులు ఇచ్చిందని చెప్పారు.
అవన్నీ మర్చిపోయి బ్రాండ్ బ్రాండ్ అని ఎగురుతున్నారు. కాంగ్రెస్ ఆదరించకపోతే బ్రాందీ షాపుల్లో పని చేయడానికి కూడా పనికిరారని రేవంత్రెడ్డి, రాజగోపాల్రెడ్డి రాజీనామా ప్రకటన అనంతరం కామెంట్స్ చేసారు.