మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తమ పార్టీనే అసలైన శివసేనగా గుర్తించాలంటూ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం చేసిన వినతిపై ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమీషన్ ను ఆదేశించింది.
ఏక్నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఆయన వర్గానికి అసలైన శివ సేన గుర్తింపు ఇవ్వరాదని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇక మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై దాఖలైన పలు పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా లేదా అన్న అంశంపై వచ్చే సోమవారం నిర్ణయం తీసుకుంటామని చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
శివసేన పార్టీ తమదేనని, పార్టీ నియంత్రణ, ‘విల్లు-బాణం’ ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలని షిండే ఎన్నికల సంఘం (ఇసి)ని కోరారు. దీంతో పార్టీ గుర్తు తమదేనని రుజువు చేసే పత్రాలను ఈ నెల 8 కల్లా సమర్పించాలని షిండే, ఉద్ధవ్ వర్గాలను ఇసి సూచించింది. శివసేన శాసనసభా పక్షంతో పాటు పార్టీ సంస్థాగత విభాగ సభ్యుల మద్దతు లేఖలను కూడా సమర్పించాలని రెండు వర్గాలను కోరింది.
అయితే ఇసి ఆదేశాలపై థాకరే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత, పార్టీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, దీంతో షిండే వినతిపై తదుపరి చర్యలేమీ తీసుకోకూడదని థాకరే వర్గం ఇసికి విజ్ఞప్తి చేసింది.
అలాగే షిండే వినతిపై ఇసి చర్యలు తీసుకోకుండా నివారించాలని కోరుతూ ఉద్ధవ్ థాకరే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. ప్రస్తుతానికి షిండే వర్గం చేసిన వినతిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇసికి స్పష్టం చేసింది.
గురువారం వాదనల సందర్భంగా సీజే ఎన్వీ రమణ.. షిండే వర్గాన్ని ఉద్దేశించి ముఖ్యమైన ప్రశ్నలు సంధించారు. ‘‘మీరు ఎన్నికైన తర్వాత రాజకీయ పార్టీలను పూర్తిగా విస్మరిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా?’’ అని తెలుసుకోవాలని ఉందని షిండే తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేను ఉద్దేశించి సీజే ఎన్వీ రమణ ప్రశ్నించారు. దీనికి ‘లేదు’ అనే సమాధానం వచ్చింది.