భీమా కోరెగావ్ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకు సుప్రీం కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
వైద్య కారణాలతో తనకు శాశ్వత బెయిల్ మంజూరు చేసేందుకు బొంబాయి హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ వరవరరావు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై న్యాయమూర్తులు యూయూ లలిత్, అనిరుద్ధ బోస్, సుధాన్షు ధూలియా ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విరసం నేత ఆరోగ్య పరిస్థితి, రెండున్నర సంవత్సరాల కస్టడీ కాలాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. ఈ కేసులో ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, చార్జీషీట్ దాఖలు చేసినప్పటికీ అభియోగాలు కూడా నమోదు కాలేదని ధర్మాసనం పేర్కొంది.
అయితే, ముంబైలోని ఎన్ఐఏ కోర్ట్ అనుమతి లేకుండా ఆయన గ్రేటర్ ముంబయిని దాటి వెళ్లకూడదని ధర్మాసనం వరవరరావుకు సూచించింది. అలాగే ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం వైద్యపరమైన కారణాలతోనే బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు చెప్పింది.
మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న అభియోగాలతో వరవర రావును 2018 ఆగస్ట్ లో అరెస్టు చేశారు. అదే ఏడాది నవంబర్‌లో ముంబయిలోని తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
ఆయనతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలాఖా, సుధా భరద్వాజ్‌లను పుణే పోలీసులు నిర్భందించారు. అయితే గత కొంతకాలం నుంచి వైద్య కారణాల రిత్యా వరవరరావు తాత్కాలిక బెయిల్ లో ఉన్నాడు.
అనారోగ్య కారణాల కారణంగా తనకు శాశ్వత బెయిల్ కావాలని ఇప్పటికే ఆయన పలుమార్లు కోర్టులో పిటిషన్లు వేశారు. కాగా ఈ నేపథ్యంలోనే వరవరరావుకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తెలిపింది.