వైవిధ్యభరితమైన భారత దేశం వైపు యావత్తు ప్రపంచం చూస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచం వైరుద్ధ్యాలతో నిండి ఉందన్నారు. ద్వంద్వాలను నిభాయించే సామర్థ్యం భారత దేశం నుంచే వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని నాగపూర్లో ‘భారత్@2047 : నా దార్శనికత, నా చర్య’ అనే కార్యక్రమంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ వైవిద్ధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, నిభాయించడం గురించి ప్రస్తావనకు వచ్చినపుడు ప్రపంచం భారత దేశం వైపు చూస్తుందని చెప్పారు.
ప్రపంచం వైరుద్ధ్యాలతో నిండిపోయిందని పేర్కొంటూ ద్వంద్వాలను నిభాయించడాన్ని కేవలం భారత దేశం నుంచి మాత్రమే తెలుసుకోగలమని ఆయన తెలిపారు. మనకు చెప్పని, సరైన రీతిలో బోధించని చారిత్రక సంఘటనలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. ఉదాహరణకు, సంస్కృత వ్యాకరణం జన్మస్థలం భారత దేశం కాదన్నారని చెబుతూ ఎందుకు? అని మనం ఎన్నడైనా అడిగామా? అని ప్రశ్నించారు.
దీనికి ప్రధాన కారణం మనం మన జ్ఞానం, విజ్ఞానాలను మర్చిపోవడమేనని డా. భగవత్ చెప్పారు. మరోవైపు మన దేశాన్ని విదేశీ దురాక్రమణ దారులు ఆక్రమించుకోవడమని ఆయన తెలిపారు. ఈ దురాక్రమణ దారులు ప్రధానంగా వాయవ్య ప్రాంతం నుంచి వచ్చారని గుర్తు చేశారు.
కులం, తదితర అంశాలకు మనం అనవసరమైన ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు. పని (వృత్తి) కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలను ప్రజల మధ్య, వర్గాల మధ్య విభేదాలను సృష్టించడానికి ఉపయోగించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భాష, వస్త్రధారణ, సంస్కృతుల విషయంలో మన మధ్య చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయని, అయితే వీటిలో చిక్కుకోకుండా, విశాల దృశ్యాన్ని చూడగలిగే మనసు మనకు అవసరమని హితవు చెప్పారు. దేశంలోని అన్ని భాషలు జాతీయ భాషలేనని, వివిధ కులాల ప్రజలు తనవారేనని, మనకు అలాంటి ఆత్మీయత అవసరమని చెప్పారు.