76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ
ఐదు ప్రతిజ్ఞలు చేశారు. ‘ రాబోయే సంవత్సరాల్లో మనం ‘పంచ ప్రణ్’పై దృష్టి పెట్టాలి. మొదటిది : అభివృద్ధి..భారత్ పెద్ద సంకల్పాలు, సంకల్పాలతో ముందుకు సాగడం, రెండవది : దాస్యం యొక్క అన్ని జాడలను తుడివేయడం, మూడవది : మన వారసత్వం గురించి గర్వపడటం, నాల్గవది : ఐక్యత బలం, ఐదవది : ప్రధాని, ముఖ్యమంత్రులతో కూడిన పౌరుల విధులు నిర్వర్తిచడం’ చేయాలని పేర్కొన్నారు.
న్యూఢిల్లీలోని ఎర్రకోటపై సోమవారం ప్రధాని మోదీ జాతీయ పతాకంను ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో ప్రతి భాష గురించి గర్వపడాలని పేర్కొన్నారు. మనకు భాష తెలిసినా, తెలియకపోయినా, మన పూర్వీకులు దాన్ని అందించినందుకు మనం గర్వపడాలని చెప్పారు. పలు నగరాల్లో డిజిటల్ ఇండియా చొరవను ఈ సందర్భంగా ప్రశంసించారు.
దేశంలో స్టార్టప్‌లు పెరుగుతున్నాయని చెబుతూ వచ్చే 25 ఏళ్లు దేశాభివృద్ధికి అంకితమివ్వాలని యువతకు పిలుపునిచ్చారు. మొత్తం మానవాళి అభివృద్ధికి కృషిచేస్తామని, అదే భారత్ బలమని తెలిపారు. ఐక్యత సాధించేందుకు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని ప్రధాని సూచించారు. మహిళల పట్ల గౌరవం భారత వృద్ధికి మూల స్థంబం అని పేర్కొన్నారు.
నారీ శక్తి గురించి కొనియాడిన ఆయన.. స్త్రీ ద్వేషాన్ని తుడిచివేస్తామని ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. 75 ఏళ్ల తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మేడ్ ఇన్ ఇండియా క్రింద తయారు చేసిన గన్ సెల్యూట్ చేశామని సంతోషం వ్యక్తం చేశారు. భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని చెబుతూ 75 ఏళ్లగా ఎన్నో ఒడిదుడుకులను చూసిందని పేర్కొన్నారు. అయితే భిన్నత్వంలో ఏకత్వం మన మార్గదర్శక శక్తిగా మారిందని ప్రధాని తెలిపారు. దేశ స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాధ్యమైనంత త్వరగా సాకారం చేయాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
‘‘మంగళ్ పాండే, రాజ్ గురు, తాంతీయ తోపే, అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మల్, భగత్ సింగ్, బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్లు ఆంగ్లేయ పాలకులకు దడ పుట్టించారు. రాణి లక్ష్మీ బాయి, బేగం హజ్రత్ మహల్ భారత నారీ శక్తి సంకల్పం ఎలా ఉంటుందనేది ప్రపంచానికి చూపించారు. వీరందరినీ గుర్తు చేసుకున్నప్పుడల్లా ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగుతాడు’’ అని మోదీ చెప్పారు. దేశపు మట్టిపై ఉన్న ప్రేమతో స్వాతంత్య్ర సమర యోధులు వీరోచిత పోరాటం చేసి మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారని ప్రధాని మోదీ గుర్తుచేశారు.
‘‘75 ఏళ్లలో మన దేశం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సంకల్పంతో మేం ముందుకు కదులుతున్నాం. తిరంగా యాత్రల ద్వారా యావత్ దేశం ఏకతాటిపైకి వచ్చింది. దేశాన్ని ఏకం చేసే మహత్తర శక్తి మువ్వన్నెల జెండాకు ఉందని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిరూపించాయి. ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ అని మేం పిలుపునిస్తే.. ‘సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్’ ద్వారా దేశ ప్రజలంతా మా ప్రయత్నంలో భాగస్తులయ్యారు’’ అని ప్రధాని వివరించారు.
