కర్ణాటకలో మత మార్పిడిలను నిరోధించే ముసాయిదా బిల్లు, కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్ బిల్ 2021 సిద్దమైనది. ఈ బిల్లు ప్రకాటం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనర్లు, మహిళలకు చెందిన వ్యక్తులను బలవంతంగా మతమార్పిడికి గురి చేస్తే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను ప్రతిపాదించింది.
ప్రతిపాదిత చట్టం చెల్లుబాటును పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా వరుస సమావేశాలను నిర్వహిస్తోంది. బుధవారం రాత్రి జరిగిన తన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో, ప్రస్తుత సెషన్లోనే బిల్లును సభలో ప్రవేశపెట్టాలని బిజెపి నిర్ణయించింది.
ప్రతిపాదిత కొత్త చట్టానికి తుది మెరుగులు దిద్దేందుకు గురువారం రాష్ట్ర హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, ఈ బిల్లును రూపొందిస్తున్న చేస్తున్న మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామితో సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయశాఖ కార్యదర్శిలతో నిర్వహించిన సమావేశంలో కూడా ముసాయిదా బిల్లుపై చర్చించారు.
తుది బిల్లులో మత మార్పిడికి విధించే శిక్షల పరిమాణంపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. “చివరి నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం విచక్షణకు వదిలివేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఇది శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టే ముందు త్వరలో పరిశీలిస్తుంది. శిక్షలు ఖరారు కాలేదు’’ అని బిల్లు ముసాయిదాకు సంబంధించి ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
“మేము వివిధ రాష్ట్రాల్లో మతమార్పిడిపై ఉన్న చట్టాలను పరిగణనలోకి తీసుకున్నాము. ఈ చట్టాలు సవాలు చేసినప్పుడు వెలువడిన తీర్పులను కూడా మేము పరిగణించాము. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే బిల్లును రూపొందిస్తున్నాం’’ అని ముసాయిదా ప్రక్రియపై అవగాహన ఉన్న ఓ అధికారి తెలిపారు.
రాష్ట్ర మంత్రివర్గం డిసెంబర్ 20న బెలగావిలో సమావేశం కానుంది. ముసాయిదా బిల్లును సమావేశంలో మరియు తరువాత వచ్చే వారం శాసనసభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ బిల్లును రాజకీయంగా పట్టు సాధించే సాధనంగా భావిస్తున్న బీజేపీ, శాసన మండలిలో ఉమ్మడి ప్రతిపక్షం చేతిలో ఓడిపోయే అవకాశం ఉన్నప్పటికీ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.
బిల్లును ప్రవేశపెట్టాలని, దానిని వ్యతిరేకించాలని నిర్ణయించుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల వైఖరిని “బహిర్గతం” చేయాలని లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.
ప్రతిపాదిత కొత్త మతమార్పిడి నిరోధక చట్టం, ప్రస్తుత ముసాయిదా రూపంలో, “తప్పుడు ప్రాతినిధ్యం, బలవంతం, మోసం, మితిమీరిన ప్రభావం, ఆకర్షణ లేదా వివాహం ద్వారా ఒక మతం నుండి మరొక మతానికి మారడం నిషేధించబడింది” అని చెప్పింది.
“ఏ వ్యక్తి తప్పుడు ప్రాతినిధ్యం, బలవంతం, అనవసరమైన ప్రభావం, ప్రలోభం లేదా ఏదైనా మోసపూరిత మార్గాల ద్వారా లేదా వివాహం ద్వారా నేరుగా లేదా ఇతర వ్యక్తిని ఒక మతం నుండి మరొక మతంలోకి మార్చడానికి లేదా మార్చడానికి ప్రయత్నించకూడదు.” అని బిజెపి ప్రభుత్వం పరిశీలనలో ఉన్న ముసాయిదా బిల్లు పేర్కొంది.
ప్రతిపాదిత చట్టం ప్రకారం, మతం మారుతున్న వ్యక్తి కుటుంబ సభ్యులు లేదా మతం మారుతున్న వ్యక్తికి సంబంధించిన ఇతర వ్యక్తులు మార్పిడి ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. సాధారణ వర్గాలకు చెందిన వ్యక్తుల విషయంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25,000 జరిమానా, మైనర్లు, మహిళలు, ఎస్సి, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను మార్చే వ్యక్తులకు మూడు నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధించాలని ప్రతిపాదించారు.
ప్రతిపాదిత చట్టం ప్రకారం, మత మార్పిడికి ప్రయత్నించే వ్యక్తులు మతమార్పిడి బాధితులకు రూ. ఐదు లక్షల పరిహారం (కోర్టు ఆదేశాలపై) చెల్లింలి. పునరావృత నేరాలకు రెట్టింపు శిక్షలను కూడా విధిస్తారు. మతమార్పిడుల ఉద్దేశ్యంతో జరిపిన వివాహాలను కుటుంబ న్యాయస్థానం లేదా న్యాయస్థానం చెల్లుబాటు కానివిగా ప్రకటించవచ్చని ముసాయిదా బిల్లు పేర్కొంది.
ప్రతిపాదిత చట్టం ప్రకారం మేజిస్ట్రేట్ కోర్టులో విచారించదగిన మతమార్పిడి నేరం గుర్తించదగిన, నాన్-బెయిలబుల్ నేరంగా పరిగణించబడుతుంది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఇతర మతంలోకి మారాలనుకునే వ్యక్తి జిల్లా మేజిస్ట్రేట్‌కు రెండు నెలల ముందుగానే నోటీసు ఇవ్వాలి. మతమార్పిడి చేస్తున్న వ్యక్తి ఒక నెల ముందుగానే నోటీసు ఇవ్వాలి. జిల్లా మేజిస్ట్రేట్ మతమార్పిడి అసలు ఉద్దేశ్యంపై పోలీసుల ద్వారా విచారణ జరిపించాలని ముసాయిదా చట్టం చెబుతోంది.
ముసాయిదా బిల్లు ప్రకారం, అధికారులకు సమాచారం ఇవ్వకపోతే, మతం మారిన వ్యక్తులకు ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు, మార్పిడిని నిర్వహిస్తున్న వ్యక్తులకు ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
ప్రతిపాదిత చట్టం ప్రకారం, మతం మారిన వ్యక్తి 30 రోజులలోపు మార్పిడి గురించి జిల్లా మేజిస్ట్రేట్‌కు తెలియజేయాలి. గుర్తింపును నిర్ధారించడానికి తప్పనిసరిగా జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు కావాలి. లేని పక్షంలో చెల్లుబాటు కాదు.
మాత మార్పిడి ధృవీకరించబడిన తర్వాత, జిల్లా మేజిస్ట్రేట్ రెవెన్యూ అధికారులు, సాంఘిక సంక్షేమం, మైనారిటీ, వెనుకబడిన తరగతులు, మార్పిడికి సంబంధించిన ఇతర విభాగాలకు తెలియజేయాలి. వారు ఆ వ్యక్తి రేజర్వేషన్లు, ఇతర ప్రయోజనాల అర్హతలకు సంబంధించి చర్యలు తీసుకుంటారు.
1977 నుండి రెవ్ స్టానిస్లాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఒరిస్సా కేసులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టడాన్ని సమర్థించేందుకు బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉదహరించింది. భారత రాజ్యాంగంలోని సెక్షన్ 25 ప్రకారం మతాన్ని ప్రచారం చేసే హక్కులో మతం మార్చుకునే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పైగా, కర్ణాటక లా కమిషన్ తన 30వ నివేదికలో మతమార్పిడులను అరికట్టేందుకు ఒక చట్టాన్ని ప్రతిపాదించిందని ముసాయిదా బిల్లు పేర్కొంది.