దేశంలో మహిళలపై గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులైనప్పటికీ మహిళలు ఈ హింసను ఎదుర్కోవలసి వస్తున్నది. తాజాగా ఒక ఎమ్మెల్యేపై భర్త చేయిచేసుకున్న ఘటన పంజాబ్‌లో జరిగింది.
అందరూ చూస్తుండగానే ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త చెంపపై కొట్టారు. పంజాబ్‌లోని తన నివాసంలో జులై 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రిందర్ ఈ వీడియో ను ట్విటర్లో పోస్ట్ చేశారు.
వివరాల ప్రకారం, పంజాబ్‌లోని తాల్వండి సాబో నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్, ఆమె భర్త సుఖ్రాజ్ సింగ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అతను కూడా స్థానిక ఆప్ నాయకుడు. దీంతో ఆగ్రహించిన సుఖ్రాజ్ అందరూ చూస్తుండగానే బల్జిందర్‌పై చేయిచేసుకున్నారు.
పక్కనున్నవారు అతనిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలను లేవనెత్తే మహిళలు ఇంట్లోనే వేధింపులు ఎదుర్కోవడం దారుణమని పేర్కొంది. ఈ ఘటనను సుమోటోగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
అయితే ఈ ఘటనపై బల్జిందర్ కౌర్ స్పందించలేదు. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొన్నారు. పంజాబ్‌లో మహిళలపై నేరాలు 17 శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజా నివేదిక పేర్కొంది. 2020లో 4,838 కేసులు ఉండగా 2021 నాటికి ఈ కేసుల సంఖ్య 5,662కి పెరిగింది. అలాగే 2020లో 504 అత్యాచార కేసులు నమోదు కాగా, 2021 నాటికి ఈ కేసుల సంఖ్య 508కి చేరింది.