తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాటా 60 శాతం ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రం నిధులు వాడుకున్నప్పుడు ప్రధాని ఫొటో ఎందుకు పెట్టరని ఆమె ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో ప్రాజెక్టుకు హైదరాబాద్ ఎంపీ ఫొటో పెట్టి ప్రచారం చేస్తారా అంటూ ఆమె నిలదీశారు.
కామారెడ్డి జిల్లాలో పర్యటన సందర్భంగా రేషన్ కార్డు దారులకు కేంద్రం కూడా ఉచితంగా ఇస్తున్నపుడు రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో పెట్టకపోవడంపై తాను కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఆమె తీవ్రంగా స్పందించారు.
తానేమి మాట్లాడానో హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలని ఆమె సూచించారు. ‘‘ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నాం. నిధులను పక్కదారి పట్టించకుండా డిజిటలైజేషన్ చేశాం. ఈ రాష్ట్రానికి ఎక్కువ, ఆ రాష్ట్రానికి తక్కువ ఇవ్వడం ఉండదు. రాష్ట్రాల పన్నును నిర్ణయించేది ఫైనాన్స్ కమిషన్.. నా చేతుల్లో ఏమీ ఉండదు” అని ఆమె తేల్చి చెప్పారు.
కేంద్రం వసూలు చేసే సెస్‌లు తిరిగి రాష్ట్రాలకే వెళతాయని పేరొక్నటు తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు అవాస్తవం అని ఆమె ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం చేసిన అప్పులు బారం ప్రజలు భరించాల్సిందే అని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు తెలియజేసే బాధ్యత తమపై ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఎవర్ని రాజీనామా చేయించాలో, ఎవర్ని ఇంటికి పంపించాలో ప్రజలకు తెలుసని అంటూ టిఆర్ఎస్ నాయకులకు ఆమె చురకలు అంటించారు. మంత్రుల వ్యంగ్యస్త్రాలకు ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసని చెప్పారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా తెలంగాణలో తరచూ పర్యటిస్తానని తెలిపారు.
సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారని అంటూ మరో రెండు మూడ్లు సార్లు తెలంగాణలో పర్యటించాలని నిర్ణయించుకున్నాను అని నిర్మలా సీతారామన్ చెప్పారు. జిల్లాల పర్యటనలో చాలా విషయాలు తెలుసుకున్నానని పెర్కన్తు రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని ఆమె తెలిపారు.