బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సోమవారం నుండి చేపట్టే నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది. గణేష్, విజయదశమి నవరాత్రుల నేపథ్యంలో ఈసారి యాత్రను పదిరోజులకే కుదించారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా శనివారం పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి. మనోహర్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. పాదయాత్రను ఈనెల 12 నుంచి 22వ తేదీ వరకు పది రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
ఈ పాదయాత్ర హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్నందున ఆయా కమిషనరేట్లకు పాదయాత్ర వివరాలను అందజేశారు. ఈనెల 12న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చిట్టారమ్మ ఆలయం వద్ద ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ ప్రత్యేక పూజలను నిర్వహించి పాదయాత్రను ప్రారంభిస్తారు. దీనిలో భాగంగా రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభను నిర్వహిస్తారు.
ఈ సభలో ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ పాల్గొంటారు. ఈనెల 22వ తేదీన అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పాదయాత్ర ముగింపు సభలో పార్టీ జాతీయ నాయకులు హాజరవుతారు. ఇప్పటి వరకు బీజేపీ నిర్వహించిన మూడు విడతల ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మొత్తం 40 నియోజకవర్గాల మీదుగా సంజయ్ పాదయాత్ర చేశారు.
నాలుగో విడత కలిపి మొత్తం 48 అసెంబ్లి నియోజకవర్గాలలో పాదయాత్ర పూర్తి కానుంది. అర్ధాంతరంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రాజీవ్ స్వగృహ, ట్రాఫిక్‌తో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, గతుకుల రోడ్లు, కాలుష్యం, డంపింగ్ యార్డు, డ్రైనేజీ వంటి సమస్యలను పాదయాత్ర సందర్బంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని మనోహర్ రెడ్డి చెప్పారు.