పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి నిరసనగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సభ్యులు 150 రోజుల పాటు ‘భారత్ జోడో’ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలతో మమేకమవుతూ, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
తమిళనాడులో కన్యాకుమారి జిల్లా మార్తాండం ప్రాంతంలో ఉపాధి హామీ మహిళా కూలీలతో రాహుల్ ముచ్చటించారు. వాళ్ల సంపాదన, స్థితిగతులను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళా రాహుల్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు.
‘‘మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తన ట్విటర్లో వెల్లడించారు.
“ఈ రోజు మధ్యాహ్నం మార్తాండమ్లో ఎంజిఎన్ఆర్ఇజిఎ కార్యకర్తలతో రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ సందర్భంగా, ఒక మహిళ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ తమిళనాడును ప్రేమిస్తున్నాడని, వారు అతనితో తమిళ అమ్మాయిని వివాహం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు” అని రమేశ్ ట్వీట్ చేశారు.
ఆ సమయంలో రాహుల్ చాలా సరదాగా కనిపించాడని ఆయన చెప్పారు. అయితే రాహుల్ వారికి ఏం సమాధానం ఇచ్చారన్నది మాత్రం ఆయన చెప్పలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైంది కాశ్మీర్ లో ముగుస్తుంది.150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితల ప్రాంతాల గుండా 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది.
‘భారత్ జోడో యాత్ర’ తమిళనాడు మీదుగా కేరళలో ఆదివారం ఉదయం అడుగుపెట్టింది. రాష్ట్రంలో 19 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఘన స్వాగతం పలికింది. కేరళ, తమిళనాడు సరిహద్దుల సమీపంలో ఉన్న తిరువనంతపురంలోని పరస్సాల నుంచి ఉదయం 7.30 గంటలకు యాత్ర మొదలైంది. సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు రాహుల్కు సాదర స్వాగతం పలికారు