ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు గ్రీన్ ఫైనాన్స్ ఇవ్వడంతోపాటు మారుమూల ప్రాంతాలకు సేవలు అందేలా చూడాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని సూచించారు. పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వడాన్ని గ్రీన్ఫైనాన్స్ అంటారు.
“సస్టైనబుల్(సుస్థిర) ఆర్థిక వాతావరణంలో ఫిన్‌టెక్ సంస్థలు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఫిన్‌టెక్ సెక్టార్ భారతదేశంలోని భారీ జనాభా నుంచి ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు” అని సీతారామన్ ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ పరిశ్రమపై ఇక నుంచి రెగ్యులేటరీ ఏజెన్సీలు మరింత ఎక్కువ శ్రద్ధ చూపుతాయని ఆమె ప్రకటించారు.
ఫిన్‌టెక్‌లు, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా డిజిటల్ లెండర్లు అందరూ నవంబర్ చివరి నాటికి తన నిబంధనలను పాటించాలని ఆర్బీఐ కోరిన నేపథ్యంలో మంత్రి ఈ విషయాలు చెప్పారు.
ఇన్నోవేషన్లు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య బ్యాలన్స్‌ను సాధించడానికి డిజిటల్ లెండింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా చట్టవిరుద్ధంగా లోన్లు ఇచ్చే యాప్‌లను అరికట్టాలని కోరింది. అన్ని లీగల్యాప్స్ ‘లిస్ట్’ని సిద్ధం చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ని కోరింది.
అన్‌రిజిస్టర్డ్ సంస్థలను యాప్ స్టోర్ల నుంచి నిషేధిస్తామని తెలిపింది. జీఎస్టీ ఇన్వాయిస్లు, యూపీఐల సాయంతో చిన్న, మధ్యస్థాయి ఇండస్ట్రీలకు (ఎంఎస్ఎంఈలు) భారీగా క్యాష్‌ఫ్లో లోన్లు ఇవ్వడం ద్వారా ఫిన్‌టెక్ కంపెనీలు దూసుకుపోవచ్చని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో భారతదేశ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ తెలిపారు. అయితే క్యాష్‌ఫ్లో ఆధారిత లెండర్లు జనాన్ని దోపిడీ చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని, ఇటువంటి యాప్‌లు స్థానిక భాషల్లో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఆయన పేర్కొన్నారు.
పరిశ్రమ అన్ని స్థాయిలలో ప్రభుత్వంతో నిరంతరం చర్చిస్తూ ఉండాలని ఆర్థిక మంత్రి సీతారామన్ కోరారు. “దూరం అపనమ్మకాన్ని తెస్తుంది కాబట్టి దానిని తగ్గించుకోండి. ప్రభుత్వానికి మరింత దగ్గరవ్వండి. ప్రభుత్వం, కంపెనీల మధ్య ఎంత ఎక్కువ భాగస్వామ్యం ఉంటే అంత ఎక్కువగా నమ్మకం పెరుగుతుంది”ఆని ఆమె కామెంట్ చేశారు.
యూజర్ల నమ్మకాన్ని పొందేందుకు ఫిన్‌టెక్ కంపెనీలు తమ సేవలు మరింత నమ్మకంగా, సురక్షితంగా ఉండేలా చూడాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కోసం ఆయన పంపిన సందేశంలో ఇన్నోవేషన్లను ప్రోత్సహించే ప్రభుత్వం, యంగ్ ఇన్నోవేటివ్ మైండ్లతో కలిసి పనిచేస్తే అద్భుతాలు సాధించవచ్చనడానికి ఈ రంగం ఒక ఉదాహరణ అని తెలిపారు.
“ఇన్నోవేషన్ ఫర్ ఇన్‌క్లూజన్ మా మంత్రం. డిజిటల్ చెల్లింపులను జీవన విధానంగా మార్చడంలో యూపీఐ విజయం సాధించింది. ఫిన్‌టెక్, స్పార్టప్ స్పేస్‌లో ఇండియా అంతర్జాతీయంగానూ సత్తా చాటి హబ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్గా ఎదిగింది. జన్‌ధన్, ఆధార్, మొబైల్.. ఈ మూడింటి వల్ల ఫిన్టెక్సెక్టార్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి’’ అని మోదీ పేర్కొన్నారు.
ఒకప్పుడు మనదేశంలో పెద్దగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవని, ఇప్పుడు బ్యాంకింగ్ యాక్సెస్‌లో అద్భుత విజయా లు సాధించామని కామెంట్ చేశారు. దేశానికి ఇది ఒక అద్భుతమైన ప్రయాణం అని ప్రధాని ప్రధాని చెప్పారు. ఇన్నోవేషన్ చాలా ముఖ్యమన్న సంగతి ఫిన్‌టెక్ డొమైన్లో పనిచేసే వ్యక్తులకు బాగా తెలుసని, ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని నిలబెట్టు కోవాలని కోరారు.
నిరుపేదలకు నాణ్య మైన ఆర్థిక సేవలను అందజేయడం ద్వారా వారి అభివృద్ధి కోసం నిరంతరం పని చేయాలని ప్రధాన మంత్రి అన్నారు. బలమైన, సంపన్నమైన దేశంగా ఇండి యాను తీర్చిదిద్దడడానికి ‘అమృత్ కాల్’లో ఫిన్‌టెక్ రంగం ఎలాంటి పాత్ర పోషిస్తుం దనే దానిపై ఈ కార్యక్రమంలో చర్చలు జరు గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.