కరోనా మహమ్మారి మనకు నేర్పిన అతిపెద్ద పాఠం పర్యావరణ మార్పు గురించేనని, ఇది పర్యావరణానికి నష్టం కలిగించకుండా మానవులు వ్యవహరించే విధానంపై ఆధారపడి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్యస్వామినాథన్ తెలిపారు.
ప్రజలందరి జీవితాలు పర్యావరణంతో ముడిపడి ఉన్నాయని ఆమె చెప్పారు. పాకిస్తాన్ వరదల మాదిరిగానే, ప్రపంచ వ్యాప్తంగా బలహీనవర్గాలు బాధపడుతున్నారని, ఇలాంటి నష్టాలు ఏ దేశమైనా ఎదుర్కోవచ్చని పేర్కొంటూ సమానత్వంపై దృష్టి పెట్టడం, పేదలకు సహాయం చేయడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.
ప్రజారోగ్య విధానం, సరైన వివరాలు, పరిశోధన ప్రాముఖ్యత కూడా అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు. వ్యాక్సిన్లు శరీరంపై ప్రభావం చూపుతున్నాయని, వాటి వలన కలిగే ప్రమాదాల కన్నా ప్రయోజనాలు అధికమని ఆమె తెలిపారు.
బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది కరోనా బారిన పడుతున్నారన్న మీడియాప్రశ్నపై స్పందిస్తూ వ్యాక్సిన్ వ్యాధి తీవ్రతను అడ్డుకుంటుందని డా. స్వామినాథన్ చెప్పారు. వ్యాక్సిన్ల కారణంగానే మహమ్మారి నుండి త్వరగా కోలుకోగలిగామని ఆమె స్పష్టం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా 1300 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకోవడంతో 20 లక్షల మందిని రక్షించగలిగామని ఆమె చెప్పారు. వైరస్ పరిణామం చెందుతూ, ప్రతిసారి కొత్త ఉత్పరివర్తనాలను వైరస్ నుండి తప్పించుకోవడానికి యత్నిస్తోందని ఆమె తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని వారు, వైరస్ బారిన పడని వారు కూడా ఉన్నారని, కానీ అవి అరుదైన కేసులని ఆమె చెప్పారు.