రూపాయి క్షీణించడం లేదని, డాలర్ బలపడుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవ్యవస్థ, కరెన్సీలతో పోలిస్తే రూపాయి చాలా మెరుగ్గా ఉందని ఆమె తెలిపారు. ఇటీవల రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 82.69కి పడిపోవడంపై అమెరికా పర్యటనలో ఉన్న ఆమె స్పందిస్తూ రూపాయి విలువ మరింత క్షీణించకుండా చూస్తామని చెప్పారు.
రూపాయి విలువను స్థిరీకరించడానికి ఆర్బిఐ ప్రయత్నిస్తోందని చెబుతూ భారతీయ కరెన్సీ విలువను నిర్ణయించడానికి మార్కెట్లో జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి డాలర్ రేటు పెరగడం, డాలర్‌కి అనుకూలంగా మారకం రేటు పెరగడంతో రూపాయి విలువ నిలిచిపోయి వుండవచ్చని ఆమె పేర్కొన్నారు. యుద్ధం నిత్యావసరాల ధరలను పెంచిందని, అభివృద్ధి చెందిన దేశాలలో ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో పెరగడానికి దారితీసిందని తెలిపారు. కాగా, ప్రపంచ మార్కెట్లలో సమస్యలు ఉన్నప్పటికీ మన దేశ ఆర్ధిక వ్యవస్థ బలహీనపడబోదని నిర్మలా సీతారామన్ భరోసా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఏడు శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాలు, విధానాలు ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తాయని ఆమె స్పష్టం చేశారు.
వాషింగ్టన్లో జరిగిన ఐఎంఎఫ్ ప్లీనరీ సెషన్లో ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సూచనలు కనిపిస్తున్నాయని, పెద్ద ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిస్తున్నాయని గుర్తు చేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరిహద్దు వ్యాపారాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అన్ని చోట్లా ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతున్నట్లు చెప్పారు.
అయితే ద్రవ్యోల్భణంను నియంత్రిస్తూనే మరింత వృద్ధి సాధించేందుకు మోదీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నదని ఆమె ఐఎంఎఫ్ సభ్యులకు వివరించారు. డిజిటల్ చెల్లింపుల విషయంలో భారత్ ఇప్పుడు ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని ఆమె చెప్పారు.
గ్లోబల్ ఎకానమీని కాపాడేందుకు పేద, తక్కువ ఆదాయం గల దేశాలకు ఐఎంఎఫ్ఎక్కువ వనరులు కేటాయించాలన్న వాదనపై స్పందిస్తూ గ్లోబల్ ఎకానమీలో తమ వాటాల ప్రకారం ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీల (ఈఎంఈఎస్) ఓటు హక్కులను పెంచడానికి కోటాల సాధారణ సమీక్షకు వచ్చే డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆమె సూచించారు.
ప్రస్తుతం భారత్ ఓటింగ్ షేరు 2.75 శాతం ఉండగా, అమెరికా షేరు 17.43 శాతం వరకు ఉంది. తక్కువ ఆదాయం గల దేశాలు బకాయిలు సకాలంలో చెల్లించడానికి ఐఎంఎఫ్ తగిన సాయం చేయాలని నిర్మల కోరారు.
ఎస్బీఐ చైర్మన్ భరోసా
మరోవంక, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు భయపడుతున్నట్టుగా ప్రపంచ మాంద్యం వచ్చినా దాని ప్రభావం భారత దేశం ఆర్ధిక వ్యవస్థపై పెద్దగా ఉండకపోవచ్చని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం పరిస్థితి బాగుంటుందని ఆయన చెప్పారు. అంచనా చేసినట్టుగానే వృద్ధి రేటు 6.8 శాతం సాధ్యమవుతుందని పేర్కొంటూ ద్రవ్యోల్భణం చాలా వరకు నియంత్రణలో ఉందని ఆయన చెప్పారు.
భారతదేశం అన్ని విధాలా బాగా పనిచేస్తోందని ఖారా ఐఎంఎఫ్ వార్షిక సమావేశం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్ జీడీపీకి దేశీయ ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యం కాబట్టి ప్రపంచ మాంద్య ప్రభావం చాలా తక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. కొన్ని ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు రిస్కులు చాలా తక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
రూపాయి గురించి మాట్లాడుతూ డాలర్ ఇండెక్స్ బలపడటం వల్ల దేశ కరెన్సీ తగ్గిందని, అయితే ఇతర వర్ధమాన మార్కెట్ ఎకానమీల కరెన్సీలతో పోలిస్తే మన కరెన్సీ బాగానే ఉందని దినేష్ ఖరా తెలిపారు. ‘‘రూపాయి విలువ తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా దిగుమతులు ఎక్కువగా ఉన్న దేశానికి ఇది చాలా నష్టదాయకం”అని పేర్కొన్నారు.
క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా శుక్రవారం డాలర్‌తో రూపాయి 82.19 వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో రూపాయి 82.26 వద్ద ప్రారంభమైంది. దీనిపై ఖారా మాట్లాడుతూ ఇండోనేషియా, బ్రెజిల్.. ఈ రెండు కరెన్సీలు మాత్రమే మన కంటే మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. అవసరమైనప్పుడు ఆర్బీఐ రూపాయి విషయంలో కలగజేసుకుంటుందని అన్నారు.