ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ కెవడియాలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియా గుటేరస్ తో కలిసి మిషన్ లైఫ్ ప్రోగ్రాంను ప్రారంభిస్తూ వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మిషన్ లైఫ్ సహాయం చేస్తుందని చెప్పారు. వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని తెలిపారు.
మన హిమానీ నదులు కరిగిపోతున్నాయని, నదులు ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలు కూడా జీవన శైలిని మార్చుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ప్రధాని సూచించారు. ప్రపంచంలోని 80 శాతం కాలుష్యం జీ 20 దేశాల్లో ఉందని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియా గుటేరస్ తెలిపారు. అందుకే జీ 20 దేశాలు పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలని సూచించారు.
వ్యక్తులు, సంఘాలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని గుటేరస్ చెప్పారు. కాగా, సుస్థిర అభివృద్ధి దిశగా ప్రజల సమిష్ఠి వైఖరిని మార్చడానికి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడమే మిషన్ లైఫ్ లక్ష్యం.
సులువుగా, సమర్థవంతంగా ఉండే పర్యావరణ హితకరమైన పనులు చేసేవిధంగా ప్రజలను ప్రోత్సహించడం, ఈ పనులను ప్రజలు తమ దైనందిన జీవితంలో ఆచరించే విధంగా ప్రేరేపించడం, మారుతున్న డిమాండ్‌కు తగినట్లుగా వేగంగా స్పందించేవిధంగా పరిశ్రమలు, మార్కెట్లను ప్రోత్సహించడం, సుస్థిర వినియోగానికి, ఉత్పత్తికి మద్దతునిచ్చే విధానాలను రూపొందించాలని ప్రభుత్వాలను, పరిశ్రమలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. ఇక అంతకు ముందు దేశంలోనే మొట్టమొదటి సోలార్ పవర్డ్ గ్రామాన్ని, మొధేరాలోని సూర్య దేవాలయాన్ని గుటేరస్ సందర్శించారు.
దీపావళికి 75 వేల మంది యువతకు ఉద్యోగాలు
ఇలా ఉండగా, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు దీపావళి కానుకను ఇవ్వనున్నారు. 75వేల మందికి వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. దీపావళి రెండు రోజుల ముందు ఈ శనివారం( అక్టోబర్ 22) వారితో వర్చువల్‌గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు.
అదే రోజు వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, తపాల, ఉపాధి, సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి పలువురు కేంద్ర మంత్రులు ఈ వర్చువల్ మీటింగ్‌కు హాజరుకానున్నారు.
ఒడిశా నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, గుజరాత్ నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ, చండీఘడ్ నుంచి అనురాగ్ ఠాకూర్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్ సహా వారి వారి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎంపీలు హాజరుకానున్నారు.
దేశంలో నిరుద్యోగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో.. వచ్చే 18 నెలల్లో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ జూన్‌లో ప్రకటించారు.
