చైనా అధ్యక్ష పదవిని జీ జిన్‌పింగ్ మూడోసారి చేపట్టబోతూ మరో తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా చరిత్ర సృష్టింపబోతున్న తరుణంలో ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున కనిపిస్తోంది. చైనాకు మహా నేత అక్కర్లేదని, ప్రజాస్వామ్యం కావాలని నిరసనకారులు కోరుకుంటున్నారు.
ఇటీవల బీజింగ్ నగరంలోని ఓ ఫ్లైఓవర్పైన దర్శనమిచ్చిన రెండు బ్యానర్లలో జీ జిన్‌పింగ్‌ను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ కనిపించింది. ఆయన అమలు చేస్తున్న జీరో కోవిడ్ పాలసీపై విమర్శలు కనిపించాయి. ఈ సంఘటన తర్వాత నిరసనలు పెరుగుతున్నాయి.
అన్ని చోట్ల నిఘా కట్టుదిట్టంగా ఉంటుండటంతో నిరసనకారులు మరుగుదొడ్లను ఎంచుకున్నారు. తమ నినాదాలను మరుగుదొడ్లలోనూ, పాఠశాలల నోటీసు బోర్డుల్లోనూ రాస్తున్నారు. ప్రజాస్వామ్యం కావాలంటూ గుర్తు తెలియని చైనా జాతీయులు ‘వాయిస్ ఆఫ్ సీఎన్’ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ప్రారంభించారు.
జీ జిన్‌పింగ్‌ను దేశాధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ చైనాలోని దాదాపు ఎనిమిది ప్రధాన నగరాలకు చేరింది. ఈ నగరాల్లో షెంజెన్, షాంఘై, బీజింగ్, గ్వాంగ్ఝౌ, హాంగ్ కాంగ్ కూడా ఉన్నాయి. జిన్‌పింగ్‌ను పదవీచ్యుతుడిని చేయాలనే నినాదాలు మరుగుదొడ్లు, పాఠశాలల నోటీసు బోర్డులపై పెట్టినట్లు కనిపించే ఫొటోలు తమకు చాలా వచ్చాయని వాయిస్ ఆఫ్ సీఎన్ అడ్మినిస్ట్రేటర్ ఒకరు చెప్పారు.
చైనా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి మరుగుదొడ్లు కీలకంగా మారాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కట్టుదిట్టమైన నిఘా, సెక్యూరిటీ కెమెరాలు ఉండటమే దీనికి కారణమని చెప్పారు. బీజింగ్‌లోని చైనా ఫిలిం ఆర్కైవ్ ఆర్ట్ సినిమాలో ఉన్న బాత్రూమ్లో ‘‘నియంతృత్వాలను తిరస్కరించండి’’ అనే నినాదాన్ని రాశారు.
అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ తదితర దేశాల్లోని సుమారు 200 విశ్వవిద్యాలయాల్లో కూడా జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలను రాశారు. మైనేలోని ఓ కళాశాలలో చేతిరాతతో ఓ నినాదం కనిపించింది. బీజింగ్‌లోని ఓ వంతెనపై ఏర్పాటు చేసిన మొదటి బ్యానర్‌ను ఈ నినాదంలో ప్రశంసించారు.
తాము చైనా ప్రజలమని, తమ మనసులోని మాటను వెల్లడిస్తున్న ఈ సందేశాన్ని వ్యాపింపజేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. వాయిస్ ఆఫ్ సీఎన్ అడ్మినిస్ట్రేటర్ మరొకరు మాట్లాడుతూ, తమ ఆగ్రహ గళాన్ని ప్రభుత్వం, దాని సెన్సార్షిప్ మిషన్లు చాలా కాలం నుంచి అణచివేస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే చాలా మంది విద్యార్థులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు ఈ బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
చైనాలో జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడపక తప్పదు. బీజింగ్‌లోని ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన బ్యానర్‌కు సంబంధించిన కీ వర్డ్స్‌ను చైనా ఇంటర్నెట్లో కట్టడి చేశారు. బీజింగ్ ప్రొటెస్టర్, సైటోంగ్ బ్రిడ్జ్ వంటి పదాలతో ఇంటర్నెట్లో వెతికినా ఈ బ్యానర్లు కనిపించకుండా చర్యలు తీసుకున్నారు.
సామాజిక మాధ్యమాల్లో బ్రిడ్జ్, కరేజ్, హీరో వంటి పదాలను కూడా కట్టడి చేశారు. బీజింగ్‌లోని సైటోంగ్ బ్రిడ్జ్ వద్ద ఓ యువకుడు ఈ నెల 13న ఓ టైరును కాల్చి, రెండు బ్యానర్లను ఆ బ్రిడ్జికి కట్టారు. ‘‘నియంత, ద్రోహి జీ జిన్‌పింగ్‌ను తొలగించాలి’’ అని ఓ బ్యానర్లో ఉంది. కోవిడ్ మహమ్మారిని నియంత్రించడానికి కఠినమైన అష్టదిగ్బంధనాలను విధించడాన్ని మరో బ్యానర్లో వ్యతిరేకించారు.
ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వేలాది మంది WeChat యూజర్లు తమ నిరసన గళాలను వినిపించారు. తాము బానిసలుగా బతకాలని కోరుకోవడం లేదని, తాము ఓటు వేసి, తమ ప్రతినిధులను ఎన్నుకుంటామని నిరసనకారులు నినదిస్తున్నారు.