పేద ప్రజల గురించి పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపుతామని మునుగోడు ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని రామాలయం చౌరస్తావద్ద జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ తాను మాట్లాడడానికి ఏమీ లేదని, తాను ఏది చేసినా కూడా చేతలతోనే చేసి బొంద పెడతా అని చెప్పారు.
తన రాజీనామా దెబ్బకు ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ మునుగోడు కు వచ్చిండని పేర్కొంటూ నమ్మించే తెలివితేటలు కొన్ని రోజులవరికే నడుస్తాయని, ఆ తర్వాత ఎవరు నమ్మరని తెలిపారు.
బిజెపి అంటే ఒక యుద్ధ నౌక, ఒక బండి సంజయ్, ఒక రఘునందన్ రావు, ఒక రాజాసింగ్ లాంటి క్షిపణలు ఉన్న యుద్ధ నౌక అని హెచ్చరించారు. కెసిఆర్ కు అహంకారం ఎక్కువై తనను ఎవరు ప్రశ్నించొద్దనే ఉద్దేశంతో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడని గుర్తు చేస్తూ
ఆ రోజు నుంచి తాను ఈ కేసీఆర్ని గద్దె దించాలని, టిఆర్ఎస్ ని బొంద పెట్టాలని అనుకొంటున్నానని వెల్లడించారు. 8 ఏళ్లలో అధికారాన్ని అడ్డమెట్టుకొని లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. నారాయణపూర్ లో ఇల్లులు వచ్చాయా? రోడ్లు వచ్చాయా? ఎవరికోసం వచ్చింది తెలంగాణ?
కెసిఆర్ కుటుంబం కోసమా తెలంగాణ వచ్చింది? వెయ్యి మంది పిల్లలు ప్రాణ త్యాగం చేసింది కేసీఆర్ కుటుంబం కోసమా? అని ప్రశ్నించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రఘునందన్, వివేక్ వెంకటస్వామి, బండి సంజయ్ లు పోరాడుతుంటే, ఇటీవల బూర నర్సయ్య గౌడ్ కూడా ఆ పోరాటానికి మద్దతుగా వచ్చారని ఆయన చెప్పారు. “
మూడున్నర యేండ్లు అసెంబ్లీలో మాట్లాడితే ఒక రూపాయి కూడా ఇవ్వలే నువ్వు నీ అయ్యా… ఇప్పుడొచ్చి గట్టుప్పల్ లో మాజీ సర్పంచ్ని అన్నా రా అన్నా రా అని బతిలాడుతున్నావ్” అంటూ కేటీఆర్ ను ఎద్దేవా చేశారు. అప్పుడు తెలంగాణ కోసం నువ్వు ఎన్నిసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వచ్చినావో…ఇప్పుడు నిన్ను బొంద పెట్టడానికి రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చిందని స్పష్టం చేశారు.
రాజగోపాల్ రెడ్డి నువ్వు ఓడ కొట్టడానికి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసుకోవడానికి కేసీఆర్ దగ్గర నిధులు తీసుకొచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన గడ్డ ఇదని చెబుతూ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదని తేల్చి చెప్పారు.
అప్పుల పాలైన తెలంగాణను గాడిలో పెట్టడానికి మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. 15 రోజులు కష్టపడండి ఆరో తారీకు వచ్చే విజయం భారతదేశం అంత ప్రతిధ్వనిస్తుందని తెలిపారు.
‘‘తెలంగాణ ప్రజల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. కేసీఆర్ రాక్షస పాలనలో నలిగిపోతున్న తెలంగాణ పేదలను సాదుకుంటారా? గొంతు పిసికి సంపుకుంటారా? గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించలేని అసమర్ధ, అక్రమ పాలన కావాలా? నిజాయితీగా పనిచేస్తున్న మోదీ పాలన కావాలా? ప్రజల కోసం ఎమ్మెల్యే పదవిని త్యజించి మంచి కోసం పోరాడుతున్న హీరో కావాలా? ప్రజలను పీడిస్తున్న విలన్ కావాలా?… మీరే తేల్చుకోండి’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మునుగోడు ప్రజలకు విజ్ఝప్తి చేశారు.
గడీల పాలనలో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తిరాలిని చేసేదాకా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే హీరో… మిగిలిన పార్టీ అభ్యర్థులు ప్రజలను ఇబ్బంది పెట్టే విలన్లు. మరి హీరో కావాలా? విలన్లు కావాలా? ఆలోచించాలని కోరారు. టీఆర్ఎసోళ్లు వస్తే మహిళలు ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకునే దుస్థితి వచ్చిందని హెచ్చరించారు.
రాజగోపాల్ రెడ్డి ఏనాడూ మోసం చేయలేదు. దగా చేయలే.. కమీషన్లు తీసుకోలే.. ఒక్కసారి ఆలోచించండి అని విజ్ఞప్తి చేశారు.
నారాయణపూర్ లో కేసీఆర్ ఆనాడు రాచకొండ గుట్టపై హెలికాప్టర్ లో వచ్చిండు. ఫిల్మ్ సిటీ పెడతా.. టూరిజం హబ్ చేస్తానన్నడు.. గిర్రగిర్ర తిరిగి కింద పడ్డడు. ఆ తరువాత ఢిల్లీ పోయి రాచకొండ పరిధిలోని భూములను గుంజుకోవాలని అధికారులను ఆదేశించిండని ధ్వజమెత్తారు.