భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. గత అర్ధరాత్రి సరిగ్గా 12.07 గంటలకు చేపట్టిన ఎల్వీఎం-3 ప్రయోగం విజయవంతమైంది. వన్‌వెబ్ అభివృద్ధి చేసిన 36 ఉపగ్రహాలతో విజయవంతంగా నింగికెగసిన రాకెట్ వాటిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఎల్వీఎం3-ఎం2/వన్‌వెబ్ ఇండియా-1 మిషన్ విజయవంతంమైందని, 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టామని ఇస్రో ప్రకటించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం 19 నిమిషాల్లోనే ముగిసింది.
ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం నిర్వహించిన మొదటి వాణిజ్య ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ అయిన వన్‌వెబ్‌కి చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా నిగిలోకి పంపించారు.
యూకేకి చెందిన ఈ ఉపగ్రహాలన్నీ కలిపి 5,200 కిలోల వరకు బరువు ఉంటాయి. ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించడంతో యూకేకి చెందిన గ్రౌండ్‌స్టేషన్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయోగం విజయంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు.
ఇస్రోకు ముందుగానే దీపావళి వచ్చిందని సోమనాథ్ తెలిపారు. ఇస్రో ప్రయోగించిన పూర్తి వాణిజ్య ఉపగ్రహ ప్రయోగం ఇది. ఈ ప్రయోగ విజయంతో వాణిజ్య ప్రయోగాల్లో మరో కీలక అడుగుపడినట్లు భావిస్తున్నారు.