లడఖ్, కశ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్‌తో కలిసి చైనా దాడులకు తెగబడవచ్చని భారత్ అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టిన నేపధ్యంలో స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వంపై జిన్‌పింగ్ పట్టు సాధించడం ఈ దిశగా విస్పష్ట సంకేతాలు పంపిందని సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు. తైవాన్‌పై డ్రాగన్ దూకుడుగా వెళ్లినా అమెరికా కారణంగా అక్కడ చైనా సాధించేదేమీ లేదని ఆయన చెప్పారు. దీంతో పాకిస్తాన్‌తో కలిసి లడఖ్, కశ్మీర్‌ను వశం చేసుకునే లక్ష్యంతో ముందుకెళుతుందని హెచ్చరించారు.
అదే జరిగితే అమెరికా మనకు ఎలాంటి సాయం చేయదని పేర్కొంటూ అందుకు భారత్ సిద్ధంగా ఉండాలని, ఆత్మనిర్భర్ అంటూ స్వామి ట్వీట్ చేశారు. ఎస్సీఓ సదస్సు సందర్భంగా చైనా అధికారిక మ్యాప్‌లను విడుదల చేయడంపై స్వామి ఇటీవల విమర్శలు గుప్పించారు.
ఈ మ్యాప్‌ల్లో లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లను చైనా పేరుతో ఆ దేశ అంతర్భాగంగా చూపారు. సరిహద్దు వివాదం నేపధ్యంలో భారత్ సాధ్యమైనన్ని కోణాల్లో యుద్ధానికి సన్నద్ధం కావాలని ఆయన కేంద్రాన్ని అప్రమత్తం చేశారు.