మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక సమక్షంలో జాతీయాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఎంపీలు, పిసిసి అధ్యక్షులు, సి ఎల్ పి లీడర్లు హాజరయ్యారు.
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గేకు ఎన్నికల్లో గెలిచిన సర్టిఫికేట్‌ను సోనియా గాంధీ అందజేశారు. తనకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక ప్రతినిధికి ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. ఒక కార్మికుడి కొడుకు, పార్టీ సాధారణ కార్యకర్త ఈరోజు ఇలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం కలలో కూడా ఊహించలేమని ఖర్గే భావోద్వేగానికి లోనయ్యారు.
తన అనుభవంతో కాంగ్రెస్ పార్టీని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు అహర్శిశలూ కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ను కాపాడుకోవడం, పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడం మనందరి ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమని ఖర్గే పేర్కొన్నారు. సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు.
ఖర్గే పార్టీలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తారని సోనియా గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి అని, కష్టించే తత్వంతో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్ష పదవి హోదాకు చేరుకున్నారని ఆమె కొనియాడారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్న సోనియా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా పెద్ద బాధ్యత అని చెప్పారు.
బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఖర్గే ఇవాళ ఉదయం రాజ్‌ఘాట్ వెళ్లి అక్కడ నివాళి అర్పించారు. కష్టకాలంలో పార్టీని ముందు ఉండి నడిపిన సోనియాకు ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. ఆమె నేతృత్వంలోని రెండుసార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.
24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి మొదటిసారిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. ఈనెల 17న జరిగిన ఎసిసిసి అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్ పై మల్లిఖార్జున ఖర్గే గెలిచారు.
కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున్ ఖర్గే 27 ఏళ్ళ వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1972లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 10 సార్లు శాసనసభకు ఎన్నికై రికార్డు సృష్టించిన ఆయన, 2009 నుంచి 2019 వరకూ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు ఆయన రాజ్యసభలో విపక్షనేతగా ఉన్నారు.