‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని మీలాంటి మోసగాళ్లు తిరిగిన తెలంగాణ గడ్డ అపవిత్రమైంది. మీ మోసాలను ఎండగడుతూ తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేయాలి’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్ఛారు.
‘‘నువ్వు, నీ అయ్య నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలే.. నువ్వు ఒక్కటి మాట్లాడితే మేం వంద మాట్లాడగలం. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది. అసలు నీ అయ్య యాడికి పోయిండు? ఎందుకు మా సవాల్ ను స్వీకరించలేదు?’’అని ప్రశ్నించారు.
“ఏ వ్యక్తి కూడా తప్పు చేస్తే తడిబట్టలతో దేవాలయానికి వెళ్లరు. నేను వెళ్లడంద్వారా బీజేపీ నిజాయితీ ఏంటో ప్రజలకు తెలిసింది. దేవుడిని నమ్మని నాస్తికుడికి అసలు సంప్రోక్షణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు” అని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం చేసిన మీరు మోసగాళ్లు… మీలాంటి మోసగాళ్లు తిరిగిన తెలంగాణ గడ్డ అపవిత్రమైందని ఆయన ధ్వజమెత్తారు. “మేం తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం…నువ్వు నీ అయ్య నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడాలే.. ఒక్కటి మాట్లాడితే వంద మాట్లాడాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నలుగురు ఎమ్మెల్యేలు, నువ్వు తప్పు చేయకపోతే ప్రగతి భవన్ లోనే ఎందుకు దాచి పెట్టారు? అని ప్రశ్నించారు.
8 ఏళ్ల పాలనలో మునుగోడుకు చేసిందేమిటి? డిగ్రీ కాలేజీ ఏది? డబుల్ బెడ్రూం ఇల్లు ఏది? ప్రజా సమస్యలన్నీ గాలికొదిలేశారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్ నిలదీశారు. మునుగోడు ఎన్నికలు ట్రైలర్. కేసీఆర్ అహంకారాన్ని దించే ఎన్నికలు. కేసీఆర్ అవినీతి, నియంత, కుటుంబ పాలనకు చరమగీతం పాడే ఎన్నికలు కాబోతున్నయ్ అని ఆయన స్పష్టం చేశారు.
బంగారు తెలంగాణ నరేంద్రమోదీ కల అని చెబుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఆ కలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ నేతలెవరూ అభ్యర్థి పేరుతో ఎన్నికలకు వెళ్లడానికి ముఖం చాలడం లేదని, బీజేపీ మాత్రం అభ్యర్ధి పేరుతోనే ఎన్నికలకు వెళుతోందని ఆయన చెప్పారు. సచివాలయానికి వెళ్లని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అంటూ రామాయణంలో అహంకారం తలకెక్కిన రావణుడు ఎట్లా పతనమయ్యారో… కేసీఆర్ కు సైతం అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు.
కేసీఆర్ దమ్ముంటే 8 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంతమందికి దళిత బంధు ఇచ్చారో? ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. కాగా ఈ నెల 31న మణుగూరులో జరుపదలచిన పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా బహిరంగ సభను వాయిదా వేసిన్నట్లు సంజయ్ చెప్పారు. అందుకు బదులుగా ప్రతి మండల కేంద్రంలో 20 వేల మంది చొప్పున 9 బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ సభల ద్వారా బీజేపీ సందేశాన్ని సులభంగా ప్రజలకు చేరుతుందని చెబుతూ ఈ సభలకు జాతీయ నాయకులతోపాటు రాష్ట్ర ముఖ్య నాయకులు హాజరవుతారని వెల్లడించారు. క్రిష్ణా జలాల వాటా పంపిణీ విషయంలో కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారని సంజయ్ ఆరోపించారు. 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా అప్పటి సీఎంతో కుమ్కక్కై 299 టీఎంసీలకే అంగీకరించిన ద్రోహి కేసీఆర్ అని మండిపడ్డారు.